రాయచోటి : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి అర్బన్ సీఐ బివి చలపతి తెలిపారు. రాయచోటి టౌన్ పోలీస్‌స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి అక్రమ రవాణా వివరాలను సీఐ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాయచోటి టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి అక్రమరవాణా కేసు దర్యాప్తులో ఉందన్నారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు రాయచోటి టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్, ప్రత్యేక పోలీసు బృందంతో కలిసి ప్రధాన నిందితుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల కదలికలను సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ద్వారా గుర్తించామన్నారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు వెళ్లి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అరుణ్‌కుమార్, యశ్వంత్‌లను పోలీసు బృందం అదుపులోకి తీసుకుందన్నారు. వారి వద్ద నుండి అక్రమ రవాణా చేస్తున్న 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం వారిని అరెస్టు చేశామన్నారు. అనంతరం నిందితులను స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.


