జాహాను ఎమ్మెల్యే చేసింది మిథున్ రెడ్డి
సాక్షి, మదనపల్లె: మదనపల్లె ప్రాంతంలో జరుగుతున్న అక్రమ గంజాయి వ్యాపారంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుమారుడి పాత్రపై సమగ్ర విచారణ జరగాలని మాజీ ఎమ్మెల్యే, వైఎఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, స మన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో యువతకు ఉపాధి కల్పించకపోగా గంజాయికి బానిసలు చేస్తున్నారని మండిపడ్డారు. వేలామంది యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మదనపల్లె, పరిసర ప్రాంతాలు గంజాయి విక్రయాలకు అడ్డాగా మారాయని దీనికి కారణం ఎవరని పోలీసులు అరా తీయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. గత ఏడాది అక్టోబర్ 31న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసుకు సంబంధించి ఓ ముఖ్య వ్యక్తి పేరు ప్రస్తావనకు వచ్చిందని, ఆ ముఖ్య వ్యక్తి ఎమ్మెల్యే కుమారుడన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. వందల కిలోల గంజాయి పట్టుబడుతోందని దీని వెనుక ఉన్న ఎమెల్యే కుమారుడి పాత్ర వెలికి తీయాలని కోరారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి, ఆయన కుమారుడు యువత జీవితాలను నాశనం చేసే గంజాయి వ్యాపారంలో ఉండడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె ప్రాంతంలో గంజాయి గొడవలకు ఎమ్మెల్యే, వారి కుమారుడు అండగా ఉండడం, వారిని కేసుల నుంచి తప్పిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాల్లో వారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు. గతంలో ఓ పోలీసు అధికారి మదనపల్లె నియోజకవర్గంలో గంజాయి వ్యాపారం అధికమైందని గుర్తించి దాని మూలాలు ఆరా తీయగా ఓ ముఖ్య నాయకుడి పాత్ర ఉందని ఆయన వెల్లడించినట్లు చెప్పారు. ఈ దందా ఆపకపోతే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్టుగా గుర్తు చేశారు. బెంగళూరు బస్టాండ్ లో గంజాయి సేవించిన యువకులు ఓ యువకుడిని చితకబాదగా పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడి చేసిన వారిని ఒకటవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుంటే వారిపై కేసు లేకుండా కాపాడింది, బయ్యారెడ్డి కాలనీలో గంజాయి విక్రయాల గ్రూపుల మధ్య గొడవ జరిగితే, జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించింది ఎమ్మెల్యే కుమారుడే అని పేర్కొన్నారు. ఇలా గంజాయి వ్యవహారాల్లో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడన్నది బహిరంగ రహస్యమని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. పెంచుపాడు ప్రాంతంలో గంజాయి సాగు కావడం వెనక అధికార పార్టీ నేతల ప్రమేయమే ఉందని ఆరోపించారు.
క్యాష్ అండ్ క్యారీ ఎమ్మెల్యే
తాను అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పనుల కోసం వచ్చిన వారినుంచి పనికి ఓ రేటు పెట్టి క్యాష్ అండ్ క్యారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలే ధ్రువీకరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాల్సిన ఎమ్మెల్యే వసూళ్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని, అభివృద్ధి చేసిన ఎంపీ మిథున్ రెడ్డి పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో పట్టు కోల్పోయిన ఎమ్మెల్యే వైఫల్యాలను ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని హితువు పలికారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాం, ఇప్పుడు కూడా అదే చేస్తున్నామని చెప్పారు. మిథున్ రెడ్డి కృషితో మంజూరైన మెడికల్ కళాశాల, బీటి కళాశాలను విశ్వవిద్యాలయం చేయడం, కేంద్రీయ విద్యాలయానికి పక్క భవనాలు, మంజూరైన ఇతర అభివృద్ధి పనులను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎంపిపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే ఆధారాలతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నీటి సమస్య తీర్చలేరా
మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తామని చెబుతున్న మీరు, అభివృద్ధికి ఆమోదం తెలిపింది వైఎస్సార్‌సీపీ కౌన్సిల్ అన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మనూజ అన్నారు. ఆమె మాట్లాడుతూ ఇప్పుడు పట్టణంలో నీటి సమస్య ఉంది, ఎనిమిది రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతోంది, దీన్ని ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. అధికారులు పనిచేయకపోవడం వల్లే మీరు వార్డుల్లో పర్యటిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. మా పాలనలో అధికారుల చేత ప్రజలకు పనులు చేయించాం, ఇలా పర్యటిస్తూ అధికారుల చేత పని చేయించలేదని అన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు జన్నే శేషాచలపతి, దండు కరుణాకర్‌రెడ్డి, ఇర్పాన్ షేక్, హర్షవర్దన్‌రెడ్డి, ప్రసాద్‌బాబు, శ్రీనివాసులు, కోటావారిపల్లె రాజా, శ్రీకాంత్‌రెడ్డి, శరత్‌రెడ్డి, లియాఖత్‌అలీ, వీఎస్.రెడ్డి, కోటూరి ఈశ్వర్, చరణ్ పాల్గొన్నారు.
మిథున్ రెడ్డిపై అర్థరహిత ఆరోపణలు చేస్తున్న షాజహాన్ బాషాను ఎమ్మెల్యే చేసింది ఆయనే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పార్టీ మైనార్టీ నాయకుడు గుండ్లూరు రఫీ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కమిటీ సభ్యుడిగా ఉన్న షాదీ మహల్ కు రూ.20 లక్షలు ఇచ్చింది ఎంపీ అన్న విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి మంజూరు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే ఆయనకు పేరు వస్తుందని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి
మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మిథున్ రెడ్డి
మీడియా సమావేశంలో
మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి,
సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆగ్రహం


