అక్రమ కేసులకు భయపడొద్దు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడొద్దు

Jun 24 2026 8:40 AM | Updated on Jun 24 2026 8:40 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 24 శ్రీ జూన్‌ శ్రీ 2026

నేడు భూమయ్యగారిపల్లెకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

వేముల : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం వైఎస్‌ జగన్‌ పులివెందులలో ఉదయం 9గంటలకు బయలుదేరి 10గంటలకు భూమయ్యగారిపల్లె గ్రామానికి చేరుకుంటారని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శ్రీగట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకుని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇటీవల ఓబులరెడ్డి శ్రీ రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు.

సాక్షి కడప/పులివెందుల : ‘రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులకు తెర తీశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఏదోక రకంగా ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుని పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అక్రమ కేసుల విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. శ్రేణులెవరూ భయపడొద్ద’ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం ఇచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరిన ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జననేతను కలిసి తమ సమస్యలను వివరించారు. కడప కార్పొరేషన్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఇటీవల పోలీసులు తనపై పెట్టిన అక్రమ కేసుల నేపథ్యంలో పూర్వాపరాలను అధినేతను కలిసి వివరించారు.

జనంతో పోటెత్తిన క్యాంపు కార్యాలయం

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో పులివెందులలో క్యాంపు కార్యాలయం ప్రజలతో పోటెత్తింది. జైజగన్‌ నినాదాలతో క్యాంపు కార్యాలయం హోరెత్తింది. వివిధ జిల్లాల నుంచి తనను కలవడానికి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, ఇతర అన్ని వర్గాల ప్రజలను వైఎస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తల కష్టసుఖాలు అడిగారు. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల బాధలు ఓపిగ్గా వింటూనే ‘నేనున్నానని.. మీకేం కాదని’ భరోసా ఇచ్చారు. పలువురి సమస్యలను సావధానంగా విన్న ఆయన వాటిని పరిష్కరించాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు.

ఆయేషాకు పరామర్శ

పులివెందుల హెలీప్యాడ్‌ నుంచి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి వస్తున్న సమయంలో భాకరాపురానికి చెందిన ఆయేషాను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. బ్రెయిన్‌ టీబీతో బాధపడుతున్న ఆయేషాకు మూడేళ్ల క్రితం వైద్య సహాయం అందించిన వైఎస్‌ జగన్‌, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని తెలుసుకుని కాన్వాయ్‌ను ఆపి స్వయంగా దిగివచ్చి ఆమెను పరామర్శించారు. అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయేషా భర్త బాబా ఫక్రుద్దీన్‌ మాట్లాడుతూ ‘వైఎస్‌ జగన్‌ దయ వల్లే గతంలో మెరుగైన వైద్యం అందిందని.. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలే’మని కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు

ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన యూసీఐఎల్‌ ఉద్యోగి సుగుణాథరెడ్డి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సుగునాథరెడ్డితోపాటు యూసీఐఎల్‌ ఉద్యోగులు దాడి జరిగిన ఘటనను వివరించారు. దాడి ఘటనకు సంబంధించి టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు వారిని అదుపులోకి తీసుకోలేదని, ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. దీనికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో టీడీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని ఆరాచకాలు చేస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. అధైర్యపడొద్దని.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కలిసి చర్చించారు. ప్రధానంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కడప మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్‌ చాంద్‌ బాషా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డీసీ గోవింద రెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, రమేష్‌ యాదవ్‌, వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, హిందూపురం ఇన్‌ఛార్జి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ పులివెందుల పరిశీలకులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ కడప మేయర్‌ పాకా సురేష్‌, పులివెందుల మున్సిపల్‌ ఇన్‌ఛార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ రుక్మిణీదేవి, వైఎస్సార్‌సీపీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సొహైల్‌, బద్వేలు నాయకుడు విశ్వనాథరెడ్డి, జమ్మలమడుగు నాయకుడు గిరిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు ధైర్యం చెప్పిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement