● ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ డిమాండ్‌తో ఉలికిపడ్డ టౌన్‌బ్యాంకు చైర్మన్
● ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు
ప్రెస్‌మీట్.. నిజాలను దాటవేస్తూ
తీవ్ర తంటాలు!
సాక్షి, మదనపల్లె: మదనపల్లె సహకార టౌన్‌బ్యాంకులో సాగుతున్న అవినీతి, అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ఈ నిలదీతతో ఉలికిపాటుకు గురైన చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మంగళవారం అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఆయన మాట్లాడిన అంశాల్లో అడుగడుగునా వాస్తవాలను విస్మరించి, అసలు బ్యాంకులో ఏమీ జరగడం లేదని చెప్పుకునేందుకు తంటాలు పడ్డారు తప్ప అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పలేకపోయారు.
చైర్మన్‌ను వేధిస్తున్న పంచప్రశ్నలు:
● రహస్య నియామకాల మతలబు ఏంటి?తాత్కాలి క ఉద్యోగాల భర్తీలో ఆర్బీఐ నిబంధనలు, రిజర్వేష న్లు ఎందుకు పాటించలేదు? ఒక్కో పోస్టును రూ.8 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలను ఎందుకు ఖండించలేదు? ఈ పెంపకంలో ఆ ‘ముఖ్య నాయకుడు’, అతని ‘ముఖ్య అనుచరుడి’ వాటా ఎంత?
● వారసత్వ పదవులపై దాగుడుమూతలెందుకు?: అర్హులైన వారున్నా సొంత కుమారుడు బాలాజీ, గోపాలకృష్ణ అనే ఆప్తుడిని కో–ఆప్టెడ్ డైరెక్టర్స్‌గా ఎందుకు నియమించారు? ‘సాక్షి’లో కథనం వచ్చే వరకు ఆ నివేదికను సహకార శాఖకు ఎందుకు దాచారు? కుటుంబ ఆధిపత్య ప్రచారాన్ని ఎందుకు ఖండించలేదు?
● డిపాజిట్లలో మీ పెట్టుబడి ఎంత?వడ్డీ రేట్లు ఎక్కు వగా ఉండటం వల్లే రిటైర్డ్ ఉద్యోగులు రూ.106 కోట్ల డిపాజిట్లు చేశారు. మరి దీనిపై మీ ప్రభావమే ఉంటే, మీ పాలకవర్గంలో ఒక్కరైనా పది రూపాయలైనా ఎందుకు డిపాజిట్ చేయలేదు?
● సంబంధం లేని ఉత్సవానికి రూ.26 లక్షలా?: వందో వార్షికోత్సవం జరిగిన 2024 జూన్ నాటికి ఈ పాలకవర్గమే లేదు. మరి నవంబర్‌లో వచ్చాక, ఏకంగా 17 నెలల తర్వాత రూ.26 లక్షల బ్యాంకు సొమ్మును ఉత్సవం పేరిట ఎందుకు తగలేశారు?
● వైరుధ్యాల లెక్కలపై నిజమేది?: శతవార్షికోత్సవ వేడుకల ఖర్చులపై సీఈఓ ప్రసాద్ రూ.23 లక్షలు అంటే, చైర్మన్ రూ.26 లక్షలు అని ఎందుకు విరుద్ధంగా చెప్తున్నారు? ఫంక్షన్ హాల్ వినియోగానికి రూ.5 లక్షల ఖర్చు చేశారని నిసార్ అహ్మద్ చెబితే, దాన్ని రూ.10 లక్షలుగా మార్చి పరువు నష్టం దావా వేస్తాననడం విడ్డూరం కాదా?
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ప్రాంతీయ ప్రజాప్రతినిధులైన ఎంపీ మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ఈ ఉత్సవానికి ఆహ్వానించకుండా ఉద్దేశపూర్వకంగా విస్మరించిన రాజకీయ కక్షసాధింపు ఉదంతాన్ని కూడా చైర్మన్ ప్రెస్‌మీట్‌లో చెప్పుకోలేకపోయారు. ప్రెస్‌మీట్‌లో సమాధానం లేని ఈ ప్రశ్నలన్నీ టౌన్‌బ్యాంకు వ్యవహారాల్లో సాగుతోన్న అక్రమాలకు నిలువెత్తు అద్దం పడుతున్నాయి. ఏ తప్పు జరక్కపోతే బ్యాంకు వ్యవహారాలపై విచారణకు డిమాండ్ చేస్తే అంగీకరించవచ్చు కదా. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది చైర్మన్ పరిస్థితి.


