రాయచోటి : ఆంధ్రప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీ డీఈఈసెట్–2026) ప్రవేశ పరీక్షను జూలై 1న నిర్వహిస్తున్నట్లు డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం రాయచోటిలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిత వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడు చేసుకోవాలని సూచించారు. పరీక్ష రోజున హాల్ టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక ఫొటో, గుర్తింపుకార్డు (ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్టు మొదలైనవి) వెంట తీసుకురావాలని తెలిపారు. డీఈఈసెట్–2026 పరీక్ష నిర్వహణ కోసం ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వాటిలో ప్రొద్దుటూరులోని శ్రీ రాజేశ్వరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కడపలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, కేఎల్‌ఎం ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల, రాయచోటిలోని శ్రీ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, భాస్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ పేర్కొన్న సమయాన్ని పరిశీలించి పరీక్షా కేంద్రానికి కనీసం ఒక గంట ముందుగా చేరుకోవాలన్నారు. సమావేశంలో డైట్ అధ్యాపకులు కొండ వెంకటసుబ్బారెడ్డి, మహమ్మద్ ఇలియాస్, ఉషా మాధురి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర గజ దొంగ అరెస్ట్
– రూ.6.5 లక్షల బంగారు, వెండి ఆభరణాలు సీజ్
మదనపల్లె టౌన్ : జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో.. అంతర్రాష్ట్ర స్థాయిలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక కరుడుగట్టిన గజ దొంగను అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ వివరాలను మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన షేక్ ఖాజాపీర్(30) వృత్తి రీత్యా పెయింటర్. ఇతనికి పెద్ద కుటుంబం ఉండటం, ఆదాయం చాలకపోవడంతోపాటు క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలో జూన్ 23న అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం వండాడి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. నిందితున్ని డీఎస్పీ కృష్ణ మోహన్ పర్యవేక్షణలో జిల్లా సీసీఎస్ సీఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో విచారణ చేశారు. సుమారు 50 ఇళ్లలో వరుస దొంగతనాలు చేసినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. అతని వద్ద నుంచి చిన్నమండెం, కలకడ, గుర్రంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన రూ.6 లక్షల విలువైన 42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల విలువైన 250 గ్రాముల వెండి వస్తువులు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో అనంతపురం జిల్లాలో 20, కర్ణాటకలో 10, అన్నమయ్య జిల్లాలో 10 పాత కేసులు ఉన్నాయి. తాజాగా జిల్లాలో నమోదైన 7 కేసుల్లో నిందితుడు. ఈ కేసును ఛేదించి, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కె.రోషన్, చిన్నమండెం ఎస్‌ఐ వి.సుధాకర్, పోలీస్ సిబ్బంది, క్రైమ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


