గాలివీడు : మండల పరిధిలోని నూరివీడు గ్రామం బోడసానివాండ్లపల్లెకు చెందిన మహిళా రైతు కె.సాలమ్మ, బి.శివారెడ్డిలకు చెందిన విద్యుత్ వైర్‌ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లి చూడగా వైర్ చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మదనపల్లె టౌన్: గడ్డిని యంత్రంతో కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు చేయి పడి మహిళ చేతి వేళ్లు రెండు తెగిపోయిన సంఘటన రామసముద్రం మండలంలో ఆదివారం జరిగింది.బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ ఎగువ లంబంవారిపల్లికి చెందిన రామకష్ణ భార్య రమణమ్మ (46) ఇంటి వద్ద పాడి పశువులకు గడ్డిని యంత్రంతో కత్తిరిస్తూ ఉండగా పొరపాటున చేయి యంత్రంలో పడింది. దీంతో ఆమె రెండు వేళ్లు తెగిపోయాయి. కుటుంబీకులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తొండూరు : తొండూరు మండలంలోని గంగనపల్లె గ్రామంలో వెలసిన గంగమ్మ గుడిలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి నగదును అపహరించారు. ఆదివారం ఉదయం అర్చకుడు ఆలయ తలుపులు తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. హుండీలో ఎంత నగదు ఉందనే విషయం తెలియరాలేదు. కొన్ని వారాలుగా హుండీ ఆదాయాన్ని లెక్కించలేదు. దీంతో హుండీలో ఎక్కవ మొత్తంలో నగదు ఉంటుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
కమలాపురం : కమలాపురం జడ్పీటీసీ సభ్యురాలు లింగాల సుమిత్రా భర్త రాజశేఖర్ రెడ్డిపై దాడి చేసిన సునీల్ అనే యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. శనివారం రాత్రి రాజశేఖర్‌రెడ్డి భోజనం చేశాక వాకింగ్ చేస్తుండగా అదే గ్రా మానికి చెందిన ఉప్పర సునీల్ కత్తితో పొడిచాడన్నారు. శరీరం వెనుక, ముందు వైపు కూడా దాదాపు 12 చోట్ల పొడిచాడన్నారు. కత్తిపోట్లకు గురైన రాజశేఖర్ రెడ్డి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. క్షతగాత్రుడుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారన్నారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు. గ్రామంలో ఈ ఏడాది జనవరి 1న కేక్ కట్ చేసే నేపథ్యంలో గ్రామంలోని యువకులు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి వారిని మందలించి ఇంటికి పంపారు. అప్పటి నుంచి రాజశేఖర్‌రెడ్డిపై పగ పెంచుకున్న సునీల్ దాడికి పాల్పడి ఉండాడని గ్రామస్థుల ద్వారా తెలిసిందన్నారు. భాధితుడి భార్య సుమిత్రా ఫిర్యాదు మేరకు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.


