రుతుపవనాలే కీలకం
కూటమి పాలనలో పరిహారం.. పరిహాసం
మదనపల్లె: జిల్లాలో వరుస కరువులతో త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సేద్యం సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం గత రెండు ఖరీఫ్ సీజన్లలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, తీవ్ర వర్షాభావం, పంటల పెట్టుబడి దక్కకపోవడం, ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేకపోవడంతో రైతులు ఈ ఖరీఫ్ లో పంటలు సాగు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది.
లక్ష్యం 61 వేల హెక్టార్లు
రాబోయే ఖరీఫ్‌లో జిల్లాలో 61,500 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గత రెండు ఖరీఫ్‌లలో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఈ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం. ఈ విస్తీర్ణానికి సంబంధించి హెక్టారుకు ఎంత దిగుబడి తీసుకురావాలో అంచనాలు కూడా సిద్ధం చేశారు. ఇందులో ఒక్క వేరుశనగ నుంచే 60 వేల టన్నుల దిగుబడి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే మొక్కజొన్న 15,450 టన్నులు, కందులు 4225 టన్నులు, సజ్జలు 2500 టన్నులు, రాగులు 2200 టన్నులు, చిరుధాన్యాలు 750 టన్నులు, పెసలు 250 టన్నులు, మినుములు 250 టన్నుల దిగుబడి కలుపుకుని ఈ ఖరీఫ్‌లో మొత్తం 85,625 టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఈ లక్ష్యాలు సాధించడం చాలా కష్టమని గత అనుభవాలను బట్టి స్పష్టమవుతోంది.
తగ్గిన విస్తీర్ణం, ప్రభుత్వ నిర్లక్ష్యం
జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ సాగు ఆందోళనకర పరిస్థితుల్లోకి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోతుంది. సాగు లక్ష్యాల్లో 50 శాతం కూడా సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సేద్యాన్ని ప్రోత్సహించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి రైతులను సాగు వైపు మళ్ళించే విషయంలో కూటమి ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. రైతులకు పరిహారమే ఇవ్వలేని ప్రభుత్వం యొక్క వర్షాభావ ఆందోళనకర పరిస్థితులపై ఏ మేరకు స్పందిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితులను దష్టిలో ఉంచుకుంటే రైతులు ఖరీఫ్‌లో పంటల సాగుకు మొగ్గుచూపుడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో మున్ముందు చూడాలి.
జిల్లాలో 90 శాతం రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే సకాలంలో రుతుపవనాలు రావడం, వర్షాలు కురిస్తే రైతులు పంటలు సాగు చేసి దిగుబడులు సాధించవచ్చు. దీనివల్ల జిల్లా రైతంగం ఆర్థిక పరిస్థితి, జీడీపీ మెరుగవుతుంది. ఫలితంగా జిల్లాలో పంటలు పండి పొలాలు పచ్చదనంతో నిండిపోతాయి. రైతుల కష్టాలు తీరుతాయి. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత ఖరీఫ్‌లో అన్న అనుమానాలు రైతాంగంలో నెలకొంది. ఇటీవల ఎల్ నినో ప్రభావం ఉండబోతుందంటూ వస్తున్న వార్తలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు కురవక కరువు పరిస్థితులు నెలకొంటే, పెట్టుబడి నష్టపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకుంటున్నారు. ప్రభావం కూడా ఈ ఖరీఫ్‌లో ఉండబోయే పరిస్థితి కనిపిస్తోంది.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదలైన తొలి ఖరీఫ్ సేద్యమే కరువుతో మొదలైంది. ఖరీఫ్ పంటల సాగు లక్ష్యం మేరకు జరగలేదు. రైతులకు ఆధారమైన వాణిజ్యపంట వేరుశనగ సాగు నామమాత్రమే. తీవ్ర వర్షలోటు కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో కూటమి ప్రభుత్వం జిల్లాలో 19 మండలాల్లో కరువున్నట్టు ప్రకటించింది. ఇందులో 12,585 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. 23,987 మంది రైతులకు రూ.21.49 కోట్ల పరిహారం చెల్లించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటిదాకా పైసా పరిహారం ఇవ్వలేదు. 2025 ఖరీఫ్‌కూడా నష్టాలను మిగిల్చింది. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె, మదనపల్లె, గాలివీడు, వీరబల్లి, వాల్మీకిపురం, రామాపురం, కురబలకోట, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో కరువు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖరీఫ్‌లో రైతులు 2,560.74 హెక్టార్లలో పంటలు నష్టపోయారని 4,904 మంది రైతులకు రూ.4.54 కోట్ల పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటిదాక ఊసేలేదు.
2026 ఖరీఫ్
సాగు లక్ష్యం (హెక్టార్లలో)
వరుస కరువులు, భారీగా తగ్గుతున్న సాగు విస్తీర్ణం
ప్రశ్నార్థకంగా మారిన సేద్యం
వర్షాధారంపైనే ఆధారపడినజిల్లా రైతాంగం
ఈ ఖరీఫ్ సాగులక్ష్యం61,500 హెక్టార్లు
కరువు, పంట నష్టాలపైకూటమి ప్రభుత్వ రిక్త హస్తం


