వైభవంగా సీతారాముల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సీతారాముల కల్యాణం

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

వాల్మీకిపురం : స్థానిక శ్రీ పట్టాభిరామాలయంలో గురువారం శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామి వారికి అర్చన, అభిషేకం, తోమాలసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. విశేష అలంకరణలో ముస్తాబైన ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని ఆస్థాన మండపంలో సంప్రదాయ బద్ధంగా తీసుకెళ్లి ఆశీనులను చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. చివరగా హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం తిరుచ్చి ఉత్సవంపై స్వామివారు తిరుమాఢ వీధుల్లో విహరించి, భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది నాగరాజ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

పోలీసుల సమస్యలు

పరిష్కరించండి

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా పోలీసుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ ధీరజ్కు అన్నమయ్య జిల్లా పోలీస్‌ యూనియన్‌ నాయకులు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల కోసం కోఆపరేటివ్‌ సొసైటీ బ్యాంకు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా నూతన పోలీసు సంక్షేమ సంఘం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జిల్లాలోని పోలీసుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించి, సంబధిత అధికారులతో చర్చించి, వీలైనంత తొందరలో జిల్లాలోని పోలీసుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీకుంటామని హామీ ఇచ్చినట్లు యూనియన్‌ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖజీ సురేష్‌, చిత్తూరు యూనియన్‌ జాయింట్‌ సెక్రటరీ రమాదేవి, హెడ్‌ కానిస్టేబుల్స్‌ మనోహర్‌, ప్రసాద్‌ నాయక్‌, కానిస్టేబుల్స్‌ బాలాజీ, మురళి, మనోహర్‌, రాజేష్‌, నిర్మల, కల్పనా తదితరులు పాల్గొన్నారు

ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలన

కురబలకోట : ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు పీజీఎస్‌ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్‌) సర్టిఫికేషన్‌ అందజేస్తున్నట్లు సుస్థిర వ్యవసాయ రాయలసీమ ప్రాంతీయ కో ఆర్టినేటర్‌ అశోక్‌ తెలిపారు. కురబలకోట మండలంలోని తెట్టు గ్రామంలో క్షేత్ర స్థాయిలో గురువారం సీఎస్‌ఏ ప్రతినిధుల బృందం ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించింది. చింతపండు, వేరుశనగ రబీ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేకుండా ప్రకృతి విధానంలో సాగు చేస్తే భూసారం బాగుంటుందన్నారు. పంట నాణ్యత పెరుగుతుందన్నారు. మన్నిక ఎక్కువ ఉంటుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు పీజీఎస్‌ సర్టిఫికేషన్‌ అందించేందుకు అన్ని మండలాల్లో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనివల్ల ఆర్గానిక్‌ పంటలుగా గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్‌ జ్యోతి, ఎన్‌ఎఫ్‌ఎ పవన్‌, ఎంఎం రఘునాథ తదితరులు పాల్గొన్నారు.

యువతి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్ట్‌

కడప అర్బన్‌ : కడప నగరం చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పటేల్‌ రోడ్‌లో నివాసముంటున్న నాదెండ్ల రాజ రెండవ కుమార్తె అయిన రెహనాకు రెండు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మారన్నగారి వీరయ్య, వహీదాల కుమారుడైన షాజహాన్‌తో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థమైన తర్వాత రెహనాతో షాజహాన్‌ మాట్లాడే క్రమంలో నీవు అంటే ఇష్టం లేదని తెలిపారు. నిశ్చితార్థమైన తర్వాత ఇలా మాట్లాడితే అవమానం భరించలేక చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పినా వినలేదు. అతని తల్లిదండ్రులు వహీదా, వీరయ్యలు కూడా షాజహాన్‌కు సపోర్ట్‌ చేస్తూ.. నువ్వు చనిపోతే మాకేం మా కుమారుడు మాకు ముఖ్యమని కఠినంగా మాట్లాడారు. రెహానా వారు మాట్లాడిన మాటలకు చనిపోవాలని నిర్ణయించుకుని తన ఇంటిలో సూసైడ్‌ నోట్‌ రాసి తన ఇంటి బెడ్‌ రూములో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. ఈ విషయమై రెహనా తండ్రి నాదెండ్ల రాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 21 వ తేదీన చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లోఎస్‌ఐ ప్రతాప్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం కేసులోని నిందితులైన మారన్నగారి షాజహాన్‌, అతని తల్లిదండ్రులు మారన్నగారి వహీదా, మారన్నగారి వీరయ్యలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను ఎస్‌ఐ తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement