కురబలకోట: గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ది చెందాలని జీవనోపాధుల (లైవ్‌లీ హుడ్స్)రాష్ట్ర సెర్ప్ డెరెక్టర్ పద్మావతి సూచించారు. బుధవారం ఆమె మండలంలోని చెన్నామర్రి మిట్ట వద్ద నున్న చింత పండు ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. యూనిట్‌లో ఉత్పత్తి పనులు ప్రారంభానికి అవసరమైన వాటిని గుర్తించారు. కురబలకోట వెలుగు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంఘాల ద్వారా మహిళలు పొదుపు అలవాటుగా మార్చుకుని ఇష్టం ఆపై అనుభవం ఉన్న వ్యాపారాలను ప్రారంభించాలన్నారు. ఇందుకు సంఘాలు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు, శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకుని కుటుంబ ఆదాయం పెంచుకోవాలన్నారు.
‘చింత’యూనిట్‌లో త్వరలో ప్రాసెసింగ్ పనులు
సౌత్ ఇండియాలోనే మొదటి యూనిట్‌గా పరిగణిస్తున్న కురబలకోట చింతపండు యూనిట్‌లో త్వరలో ఉత్పత్తి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. టెక్నికల్ సిబ్బంది, ఇతర సాంకేతిక అవసరాలను గుర్తించామన్నారు. ఇన్నాళ్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈ యూనిట్ ఉండేదన్నారు. దీనిని పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాలతో అన్నమయ్య జిల్లా పరిధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.సెర్ఫ్ అడిషినల్ డైరెక్టర్ మహిత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


