ప్రతి ముస్లిం పాటించాలి
జకాత్ తప్పనిసరి
● రంజాన్ మాసంలో దాన,ధర్మాలకు అధిక ప్రాధాన్యం
● ఈ ఏడాది ఫిత్రా రూ.100గా ఖరారు
మదనపల్లె సిటీ : ధనికులతో సమానంగా... పేదవర్గాలు కూడా జీవనం గడపాలి. ప్రత్యేకంగా పవిత్ర రంజాన్‌ను ఎలాంటి ఆర్థికపరమైన లోటుపాట్లు లేకుండా జరుపుకోవాలి. ఇది ఇస్లాం తత్వం. సమానత్వంతో కూడిన జీవనాన్ని నిర్దేశిస్తోంది. ధాన, ధర్మాలు, ధార్మిక సత్కార్యాలకు రంజాన్ మాసం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఫిత్రా అంటే..
రంజాన్ మాసంలో జకాత్, ఫిత్రా ఇస్తారు. ఫిత్రా అనే పదానికి అర్థం తనతోపాటు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి పేదలకు దానం చేయాలని ఇస్లాం ఆదేశించింది. ఒక కుటుంబంలో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నా.. అందరి పేరిట పేదలకు దానం చేయాలని సూచించింది. రంజాన్ రోజున ప్రత్యేక నమాజు ఆచరించక ముందే ఫిత్రా చెల్లించాలంటూ ఆదేశించింది. ఇది ఒక విధిగా నిర్దేశించింది. దానం విధిగా మారడానికి హదీసులో ఇలా ఉంది. ఉపవాసి చిన్న చిన్న పొరపాట్లను దూరం చేయడానికి, పేదవారు కూడా అందరితో కలిసి పండుగను ఘనంగా జరుపుకోవడానికి దానం ఉపయోగపడుతుంది.
ఏ రూపంలో చెల్లించాలి
సాధారణ స్థితిలో ఉన్న ప్రతి ముస్లిం 1750 గ్రాముల గోధుములు లేకుంటే అంత సమానమైన డబ్బును పేదలకు దానం చేయడమే ఫిత్రా. ఈ ఏడాది మార్కెట్ ధరలకు అనుగుణంగా పెద్దలు రూ.100 ఖరారు చేశారు. అలాగే జావ 3.5 కేజీలు లేదా రూ.245 ఖర్జూరం, 3.5 కిలోలు లేదా రూ.1050 కూడా చెల్లించవచ్చు. 52.50 గ్రాముల వెండి లేదా 75 గ్రాముల బంగారం లేదా అంత విలువైన ధన,ఆస్తులు కలిగి వుండే ప్రతి ముస్లిం జకాత్‌కు అర్హుడు. తమ సొమ్మును లెక్కకట్టి అందులో నుంచి 2.5 శాతం పేదలకు పంచాలి.
70 రెట్ల పుణ్యం
కల్మా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాంకు అల్లాహ్ రక్షించడమే కాకుండా వృద్ధి చేస్తారని మౌల్వీలు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో కంటే రంజాన్ మాసంలో జకాత్ ఇచ్చే వారికి 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుందని, పరలోకంలోనూ లాభం చేకూరుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. జకాత్ ఇవ్వడం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతులు తొలగిపోతాయి. జకాత్ ఇవ్వని, రోజా ఉండని వ్యక్తిలో వ్యాపార ఆలోచన ఏర్పడుతుందని, తన లాభం చూసుకొని ఇతరుల బాధలు పట్టించుకోరని, ఇది ఇస్లాంకు వ్యతిరేకమని మౌల్వీలు చెబుతున్నారు.
ఎవరు.. ఎవరికి చెల్లించాలి
ధనవంతులు కాకపోయినా, కనీస ఆదాయ వనరులు ఉన్న వారు సైతం తమ కంటే పేద వారికి ఫిత్రా చెల్లించాలి. పండుగ నమాజుకు ముందుగా ఇంట్లో సంతానం కలిగితే శిశువు పేరు మీద కూడా దానం చేయాలి. పేద వర్గాలకే కాకుండా పేద విద్యార్థులు చదువుకునే మదర్సాలకు సైతం సమకూర్చవచ్చు.
ఫిత్రా దానాన్ని ప్రతి ముస్లిం పాటించాలంటూ ఇస్లాం నిర్దేశించింది. ఉపవాసదీక్ష సమయంలో దీక్షా పరుని చెడు తలంపు, చెడు ఆలోచనలు, నోటి నుంచి వెలువడే అసత్యాలు, వంటి పొరపాట్లన్నీ క్షమార్హం అవుతాయంటూ మహ్మద్ ప్రవక్త (సల్లెల్లాహు అలైహివ సల్లం) చెప్పారు.
– హాఫీస్ ఇక్బాల్ అహ్మద్, మతగురువు, మదనపల్లె
రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం జకాత్, ఫిత్రా ఇవ్వడం తప్పనిసరి. ఇస్లాంలో జకాత్ ఇవ్వడం కచ్చితమైనది. పంచ నియమాల్లో ఇది ఒకటి. దీనివల్ల అల్లాహ్ వారి ఆరోగ్యాలను కాపాడటంతోపాటు సిరిసంపదను వృద్ధి చేస్తారు.
– పి.మమమ్మద్‌ఖాన్, మదనపల్లె


