లింగాల : మండల పరిధి కోమన్నూతల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళ సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన జ్యోష్న (24), కోమన్నూతల గ్రామంలోని నారప్పగారి వీరబాబు ప్రేమించుకుని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరబాబు మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా కూలీ పని చేసి సంపాదించిన మొత్తాన్ని మద్యానికి వెచ్చిస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి తరచూ గొడవలు జరిగేవి. సోమవారం వీరబాబు పులివెందులకు అరటి కాయల లోడు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో కూడా ఫోన్ చేసి భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించి తోడి కోడలు రోజా ఇంట్లోకి వచ్చి చూడగా, ఉరి వేసుకుని వేలాడుతున్న జ్యోష్నను చూసి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే జ్యోష్న అప్పటికే మృతి చెందిందని ఎస్‌ఐ తెలిపారు. జ్యోష్న మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


