● మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
వాల్మీకిపురం : నిరంకుశ అవినీతి పాలన అంతం కోసం ప్రజలందరూ ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ దుష్ట పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. సంపద సృష్టించామని చంద్రబాబు ప్రభుత్వం బాకా ఊది చెబుతుంటే, ఆ సంపద తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి చేరడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. ఎన్నో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి నేతలు ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పార్టీలకతీతంగా అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, కష్టకాలంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది ప్రజలు ఆయన వెంట వస్తున్నారని, ప్రజల్లో ఆయనుకున్న అభిమానం అలాంటిదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ జగన్ పాలన సాగించారని తెలిపారు. జగనన్న పిలుపు మేరకు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. మనమంతా సమష్టిగా కృషి చేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీళ్లభాస్కర్, కేశవరెడ్డి, శివారెడ్డి, సుధాకర్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, రఘు, గోపాల్, మునిభాస్కర్, నాగరాజ, శ్రీనివాసులు, మధు, సిద్దారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు.


