హత్యాహత్నం కేసులో రెండేళ్లు జైలు | - | Sakshi
Sakshi News home page

హత్యాహత్నం కేసులో రెండేళ్లు జైలు

Mar 18 2026 8:16 AM | Updated on Mar 18 2026 8:16 AM

చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయి శివప్రశాంత్‌కు కడప అదనపు అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి జీసీ ఆసిఫా సుల్తానా రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించారు. చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2023 అక్టోబరు 26న సాయంత్రం ఆరు గంటల సమయంలో రోడ్డు క్రిష్ణాపురం గ్రామానికి చెందిన పిల్లనారిగాండ్ల గంగాదేవి కుమారుడు జగదీశ్‌ సింహాద్రి గ్రామంలోని రోడ్డు పైన హెయిర్‌ కటింగ్‌ కోసం వెళ్తుండగా.. కొంత మంది రోడ్డుపై నిలుచొని ఉండి, వారిలో ఒకరు జగదీష్‌ను ఊరు, పేరు వివరాలు అడిగారు. అలాగే ఎక్కడికి పోతున్నావ్‌ అని, నా గురించి నీకు తెలియదా అని అడగగా.. తెలియదని జగదీష్‌ సమాధానం తెలిపి తాను రామ్మోహన్‌రెడ్డి అంగడి వద్దకు నడుచుకుంటూ పోయేసరికి వెనుక వైపు నుంచి శివప్రశాంత్‌ స్కూటీలో వచ్చాడు. వచ్చి రావడంతోనే జగదీష్‌ను ఏరా కొడకా నేను అడిగితే సరిగ్గా సమాధానం చెప్పవా ఇంతకు ముందు ఒకరిని చంపినా, అయినా కూడా నా గురించి తెలియదా అంటూ బెదిరింపులకు దిగాడు. నాకే ఎదురు సమాధానాలు చెప్తావా నిన్ను చంపితే నీకు ఎవరు దిక్కు అని తన వద్ద ఉన్న బీరు బాటిల్‌తో తలపై కొట్టి వెంటాడి చంపాలనే ఉద్దేశంతో విచక్షణ రహితంగా పొడిచాడు. చుట్టుపక్కల వారు గమనించి అక్కడికి రాగా పారిపోతూ ఎప్పటికై నా నీ చావు నా చేతిలోనే అని బెదిరిస్తూ వెళ్లిపోయాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు కడప రిమ్స్‌ హాస్పిటల్‌లో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌లో 2023 అక్టోబర్‌ 31న కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేసి నిందితుడు నరసరామయ్యగారిపల్లెకు చెందిన శివప్రశాంత్‌ అని గుర్తించి, అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో కేసు విచారణ సమయంలో చింతకొమ్మదిన్నె పోలీసులు సాక్షులను ప్రవేశ పెట్టడంతో, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఒక్కసాం శ్రీనివాసులు సమర్థంగా వాదనలు వినిపించారు. నేరం నిరూపణ కావడంతో కోర్టు వారు ముద్దాయికి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించారు. నేరం నిరూపించడటంలో దర్యాప్తు అధికారి ఎస్‌ఐ.శ్రీనివాసులురెడ్డి, కోర్టు మానిటరింగ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, హెడ్‌ కానిస్టేబుల్‌ పుల్లయ్య, హోంగార్డు రెడ్డయ్య, కేసు పర్యవేక్షణ చేసిన ప్రస్తుత సీఐ బాల మద్దిలేటిని ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement