కురబలకోట : ఇంజినీరింగ్ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా సరికొత్త ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలు వ్యవస్థాపకత కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తమిళనాడుకు చెందిన అన్న యూనివర్సిటీ మెకానికల్ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం అంగళ్లు మిట్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యలో ఆవిష్కరణలు–వ్యాపారోత్పత్తి అభివృద్ధి అంశంపై సాంకేతిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేటి ఇంజినీరింగ్ విద్యార్థులు డిగ్రీలతో సరిపెట్టుకోకుండా సమాజంలో సంక్లిష్ట సమస్యలకు సాంకేతిక పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఆలోచించాలన్నారు. హ్యాక్‌ధాన్, డిజైన్ థింకింగ్ వంటి వేదికల ద్వారా సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవాలన్నారు. అవసరాలకు సరిపోయే విధంగా సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయాలన్నారు. కష్టమైన పనిని సులభ సాధ్యం చేయాలన్నారు. అప్పుడే ఇంజినీరింగ్ విద్యకు సార్థకత చేకూరగలదన్నారు.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
సిద్దవటం : మండలంలోని భాకరాపేట రైల్వేస్టేషన్ సమీపాన ఉన్న మహబూబ్‌నగర్ గ్రామ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మగ వ్యక్తి (50) మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ముఖం గుర్తు పట్టడానికి వీలు లేని విధంగా గాయాలయ్యాయన్నారు. మృతి చెందిన వ్యక్తి ఆరెంజ్, తెలుపు గళ్ల చొక్కా, లైట్ బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుడి మరణానికి గల కారణాలు, మృతుడి ఆచూకీ గురించి విచారణ చేస్తున్నామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వే సీఐ 9247575623, ఎస్‌ఐ 9247575624లకు సమాచారం ఇవ్వాలని కోరారు.


