మదనపల్లె టౌన్ : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు పడవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త సాంకేతికతతో సైబర్ నేరగాళ్లు పుంతలు తొక్కుతున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే తన కష్టార్జితాన్ని కాపాడుకోగలరని తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని హెచ్చరించడం జరుగుతోందన్నారు. వాట్సప్, ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింకులు పొరపాటున కూడా ఓపెన్ చేయరాదన్నారు. అలాగే ఓటిపి, బ్యాంకు వివరాలు, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పకూడడదని పేర్కొన్నారు.
సైబర్ మోసానికి గురైతే ఏమి చేయాలి
ఆన్‌లైన్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకూడదన్నారు. ఆర్థిక పరమైన సైబర్ నేరం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. మోసం జరిగిన మొదటి గంట అత్యంత కీలకం అన్నారు. వెంటనే పోయిన డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. నేరుగా www.cybercrime.gov.in వెబ్‌సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.
ఫిర్యాదు చేసేటప్పుడు ఉండాల్సిన వివరాలు
ట్రాన్షక్షన్ ఐడీ, తేదీ, మోసగాళ్ల ఫోన్ నంబర్లు, ఖాతా వివరాలు ఉండాలని తెలిపారు. అలాగే చాటింగ్ స్క్రీన్ షాట్లు, వచ్చిన సందేశాల వివరాలను పొందుపరచాలని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు మీ అమామకత్వాన్ని, ఆశను పెట్టుబడిగా మార్చుకుంటారని తగు జాగ్రత్తలతో మెలగాలని ఎస్పీ వివరించారు.


