శివోహం!
● జిల్లా అంతటా మార్మోగుతున్న శైవనామం
● శైవ క్షేత్రాల్లో ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
● ఇప్పటికే కొండ కోనలకు చేరుకున్న భక్తజనం
● నేడు మహా శివరాత్రి పర్వదినం
కడప సెవెన్‌రోడ్స్: శివుడు....భోళాశంకరుడు...భక్తవ శంకరుడు...ఆకు, పండు, పువ్వు, నీరు ఇలా ఏమిచ్చి మనసారా మొక్కినా భక్తులను కరుణిస్తాడు...వరాలు కురిపిస్తాడు....ఆపదలో ఆదుకుంటాడు....అందుకే ఆయన భక్తవ శంకరుడు. ఆ స్వామి వారిని తలుచుకునే మహాశివరాత్రి భక్తులకు ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. నిర్వాహకులు శివాలయాలను అందంగా తీర్చిదిద్దారు.
● ఉమ్మడి జిల్లాలో ప్రముఖ శివాలయాలు అందులోనూ అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల సంఖ్య 15కి పైగానే ఉంది. ఒకప్పుడు ఈ జిల్లాలో శైవం బాగా విస్తరిల్లింది. జిల్లాలో వీరశైవ ఆలయాలు కూడా ఉండడంతో అటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా శివరాత్రి సందర్భంగా భక్తులు ఈ జిల్లాకు వస్తుంటారు. మహాశివరాత్రి సందర్బంగా జిల్లా అంతటా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాల్లో శివరాత్రి పూజలు నిర్వహించడానికి జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య ఆరోగ్య, పంచాయతీ, అగ్నిమాపకశాఖ, పోలీసు తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో ఇప్పటికే పలుమార్లు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలను పరిశీలించారు. పోలీసు అధికారులు కూడా తమ పరిధిలోని శైవ క్షేత్రాలకు బందోబస్తు కోసం తరలివెళ్లారు. శనివారం ఉదయం నుంచే అటవీ క్షేత్రాల మొక్కులుగల భక్తులు ప్రత్యేక వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లేందుకు పలువురు భక్తులు ద్విచక్ర వాహనాలను ఉపయోగించడంతో దారులన్నీ రద్దీగా మారాయి. నడక శ్రమ తెలియకుండా భక్తులు చేసే శివనామ స్మరణతో ఆయా క్షేత్రాలు మార్మోగాయి.
శివ పూజలకు ఘనంగా ఏర్పాట్లు
శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలలో శివయ్యకు విశేష పూజలు నిర్వహించనున్నారు. జిల్లాలో లక్షల మంది హాజరయ్యే క్షేత్రా లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పొలతల, నిత్యపూజస్వామికోన, అత్తిరాల, భైరవకోన, కపర్థీశ్వరకోన, కన్యతీర్థం, భానుకోట, మోటకట్ల తదితర ప్రాంతాలకు భక్తులు భారీగా హాజరవుతారు. అటవీ ప్రాంతాలతోపాటు గ్రామాలు, పట్టణాలు, కడప,రాయచోటి, నగరంలోని శివాలయాలలో కూడా వైభవంగా పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు అన్ని ఆలయాలలో పండుగ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేయనున్నారు. రాత్రి 8 నుంచి అర్థరాత్రి వరకు భజనలు, ప్రవచనా లు, భక్తి గీతాలాపనలు నిర్వహించనున్నారు. అర్దరాత్రి లింగోద్భవం సందర్భంగా మహాన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
విద్యుద్దీపాల వెలుగులో ఆలయం
శివోహం!
శివోహం!


