ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విఫలం

Feb 14 2026 7:51 AM | Updated on Feb 14 2026 7:51 AM

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విఫలం

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విఫలం

మదనపల్లె అర్బన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలు, సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, మధుసూదన్‌ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో భాగంగా శుక్రవారం స్థానిక మిషన్‌ కాంపౌండ్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో మొత్తమ్మీద సుమారు రూ.23 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం అరకొర చెల్లింపులు చేయడంతో మొత్తం బకాయిలు రూ.34 వేల కోట్లకు చేరిందన్నారు. ముఖ్యంగా పీఆర్సీ, డీఏ, సరెండర్‌ లీవ్‌, పీఎఫ్‌, మెడికల్‌ బిల్లుల చెల్లింపులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాపోయారు. అయితే విడతల వారీగా నాలుగు డీఏలు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం ఒక్క డీఏతో సరిపెట్టిందని వివరించారు. దీంతో పెన్షనర్ల ఆశలు అడియాశలయ్యాయని పేర్కొన్నారు. దీంతోపాటు 15 నెలలుగా గ్రాట్యుటీ చెల్లించలేదన్నారు. ఇందులో భాగంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్న లక్షలాది ఉద్యోగుల ఆకాంక్షను తుంగలో తొక్కారని మండిపడ్డారు. అయితే ఎన్నికల సమయంలో ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు పెన్షన్‌ కార్పొరేషన్‌, సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం కొనసాగింపు తదితర సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. పైగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ల అమలు, సమస్యల పరిష్కారం ఊసే లేదన్నారు. డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితం శూన్యమన్నారు. వీటిపై అనేకసార్లు కూటమి ప్రభుత్వానికి విన్నవించి, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించునే నాథుడే లేడన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆదేశాల మేరకు ఒక్క రోజు నిరసన వ్యక్తం చేశామన్నారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్‌కుమార్‌రెడ్డి, జగన్‌మోహన్‌, మురళీ, మోహన్‌, వేణుగోపాల్‌రెడ్డి, నరసింహులు, జనార్ధన్‌రెడ్డి, గిరిధర్‌నాయక్‌, భాస్కర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రభాకర్‌, రమణ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement