రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించండి
● మసీదు ఆస్తులపై
వాస్తవాలు వెలుగులోకి తేవాలి
● వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్
మదనపల్లె : మదనపల్లె మసీదు ఆస్తులు, ఆదాయ, వ్యయాలపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులు, ఆదాయంలో రూ.3 కోట్ల అక్రమాలు జరిగాయని అసెంబ్లీలో ఆరోపిస్తూ దానిపై విచారణ జరపాలని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రభుత్వాన్ని కోరడాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్, ఏపీఎండీసీ మాజీ చైర్మన్ షమీంఅస్లాం ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మదనపల్లెలో మసీదుకు వచ్చే కోట్లాది ఆదాయం, నిధుల నిల్వ, వక్ఫ్‌ఆస్తుల విషయంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, దీనిపై ఎమ్మెల్యే విచారణకు కోరడం మంచి పరిణామమని అన్నారు. 2014 నుంచి జరిగిన వాటిపై విచారణ మొదలుపెట్టి ఇప్పటిదాకా ఏం జరిగిందో తేలాలంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. దీనిపై చిత్తశుద్ధితో ప్రభుత్వం ద్వారా విచారణ జరిపిస్తే ఎమ్మెల్యేను సత్కరిస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా వక్ఫ్ పరిధిలోకి వెళ్లిన మసీదు ఆస్తులు, వాటి నిర్వహణ, స్థలాలు ఎవరెవరికి ఇచ్చారు, వాటి ఆదాయం ఎక్కడికి వెళ్తోంది అనే వివరాలు బహిర్గతం కావాలని ముస్లిం సమాజం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోందని, ఎమ్మెల్యే విచారణకు కోరడం శుభపరిణామమని అన్నారు. వైస్‌చైర్మన్ నూర్‌ఆజం మాట్లాడుతూ మసీదు ఆస్తులు, స్థలాల్లో వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. మీరు విచారణ కోరడం ఎంతో మంచిది, సత్వరమే ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించి నిజాలను వెలుగులోకి తేవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు గుండ్లూరి రఫీ మాట్లాడుతూ 2014 నుంచి మొదలైన షెడ్ల నిర్మాణం, వాటి ఆదాయం, అక్రమాలపై విచారణ చేస్తే తమ వద్ద ఉన్న ఆధారాలు అందిస్తామన్నారు. మసీదు సొమ్మును కాజేసిన వారెవరైనా శిక్షకు గురికావాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్ బీఏ.ఖాజా, నాయకులు రహంతుల్లా, ఇర్పాన్‌షేక్, రహీం, చాంద్‌బాషా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


