బస్సులో నిద్రిస్తూ గుండెపోటుతో డ్రైవర్ మృతి
పెద్దతిప్పసముద్రం : పగలంతా బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గురువారం రాత్రి బస్సులో నిద్రించాడు. ఆయన నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలం ఈడిగపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎస్‌ఎస్ బాషా (50) మదనపల్లి వన్ డిపోలో పని చేసేవాడు. విధి నిర్వహణలో భాగంగా గురువారం రాత్రి 8 గంటలకు మదనపల్లెలో బయలుదేరి 9–45 గంటలకు నైట్ హాల్ట్ పెద్దతిప్పసముద్రం చేరుకున్నాడు. భోజనం అనంతరం డ్రైవర్, కండక్టర్ బస్సులో నిద్రించారు. శుక్రవారం వేకువజామున 4:15 గంటలకు బస్సు తిరిగి ఇక్కడి నుంచి మదనపల్లెకి బయలు దేరాలి. డ్రైవర్ ఎంత సేపటికి నిద్ర లేవకపోవడం, ఎలాంటి చలనం లేకుండా నిర్జీవంగా పడి ఉండటంతో.. కండక్టర్ మంజునాథ్ 108కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. 108 వాహన సిబ్బంది వచ్చి పరీక్షించగా గుండెపోటుతో డ్రైవర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఈ విషయాన్ని డిపో అధికారులకు, మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ క్రమంలో వేరే డ్రైవర్‌ను రప్పించి బస్సును డిపోకు తరలించగా, డ్రైవర్ మృతదేహాన్ని కుటుంబీకులు కారులో ఈడిగపల్లికి తీసుకెళ్లారు.
వ్యక్తి అదృశ్యం
కేవీపల్లె : వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్ తెలిపారు. వివరాలిలా వున్నాయి. మండలంలోని మఠంపల్లె పంచాయతీ గొల్లపల్లెకు చెందిన బాల వెంకటరమణ (50) ఈ నెల 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు కలకడ సీఐ 8712626239, కేవీపల్లె ఎస్‌ఐ 9440900710 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగి, ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై ముదివేడు ఎస్‌ఐ మధురామ చంద్రుడు కథనం మేరకు వివరాలు.. మండలంలోని అంగళ్లు గ్రామం తుమ్మచెట్లపల్లెకు చెందిన రైతు పి. విశ్వనాథ(48) బైక్‌లో సొంత పనిపై అంగళ్లుకు వెళ్లాడు. కదిరి రోడ్డులో పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో బయలుదేరాడు. ఇంటికి బైకులో వెళుతుండగా మార్గంమధ్యలోని మిట్స్ కళాశాల వద్ద, ముందు వెళుతున్న ట్రాక్టర్ షడన్‌గా రోడ్డు క్రాస్ చేయడంతో తప్పించబోయి, ట్రాక్టర్ ట్రాలీని రైతు వెనక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి విశ్వనాథ్‌ను చికిత్సల కోసం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్సలు అందించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


