ఎంఎస్‌ఎంఈలకు వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం దోహదం
మదనపల్లె రూరల్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ)లు చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సరఫరాదారులుగా ఎదిగేందుకు వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(వీడీపీ) ఉపయోగపడుతుందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణ కిషోర్ అన్నారు. ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ–ఆర్‌ఏఎంపీ పథకం కింద హైదరాబాద్‌కు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) నిర్వహణలో పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో రెండు రోజుల వీడీపీ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణకిషోర్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక వనరులు, డిమాండ్, సరఫరా, పరిస్థితులు, ఎంఎస్‌ఎంఈ, ఉద్యమి రిజిస్ట్రేషన్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ పాలసీలు, యంత్ర సామగ్రిపై లభిస్తున్న ప్రోత్సాహకాలు, ఎంఎస్‌ఎంఈలకు అందుబాటులోని సబ్సిడీలు, అవకాశాలపై అవగాహన కల్పించారు. విజయవాడకు చెందిన ఎంఎస్‌ఎంఈ–సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈల పోటీ సామర్థ్యాన్ని పెంచడం, మార్కెట్ లింకేజీలను బలోపేతం చేయడం, ఆర్థిక వనరులను మెరుగుపరచడం, నాణ్యత, సస్టెయినబిలిటీ, చట్టపరమైన అనుసరణలను ప్రోత్సహించడంపై వివరించారు. వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఎంఎస్‌ఎంఈలకు వాస్తవమైన వ్యాపార అవకాశాలు సృష్టించే ప్రాక్టికల్ ప్లాట్‌ఫామ్‌గా పేర్కొన్నారు. జ్ఞానాంబిక కరస్పాండెంట్ డాక్టర్.ఆర్.గురుప్రసాద్, మదనపల్లె నుంచి పట్టు, టెర్రకోట ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు ఎగుమతి చేయవచ్చన్నారు. హ్యాండీక్రాఫ్ట్‌స్ డిపార్ట్‌మెంట్ ఏడీ పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో హ్యాండీక్రాఫ్ట్‌స్ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, స్థానిక వనరులను వినియోగించి ఎంఎస్‌ఎంఈలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఎంఎస్‌ఎంఈలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. మొదటి రోజు వీడీపీ కార్యక్రమంలో 152 మంది ఎంఎస్‌ఎంఈలు పాల్గొన్నారు. 15 ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు తమ ఉత్పత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ–సీఐటీడీ సీనియర్ కన్సల్టెంట్ ఎస్.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


