అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు
ఒంటిమిట్ట : గత కొన్నేళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి సన్నిధి నుంచి అమెరికా దేశానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ముమ్మడి పాపిరెడ్డి గారి మల్లారెడ్డి కుటుంబం పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా అమెరికాకు పంపాలనే ఉద్దేశంతో శుక్రవారం ముమ్మడి పాపిరెడ్డి గారి మల్లారెడ్డి, ఆయన కుమారుడు వెంకట సుబ్బారెడ్డి, వారి కుటుంబ సభ్యులతో కలిసి తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడి సన్నిధికి తీసుకొచ్చారు. ముందుగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రదక్షణ కావించి, గర్భాలయంలోని మూల విరాట్ చెంత.. వారు తెచ్చిన తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఉంచి ఆలయ అర్చకులు వీణారాఘవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ ఒంటిమిట్ట రామయ్య చెంత నుంచి అమెరికా దేశంలోని చికాగోలో గల లెమోంట్ రామాలయంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి వీటిని పంపించి, వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ టీటీడీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, కుటుంబ సభ్యులు సత్యభాను శ్రీ, సాయి తన్విరెడ్డి, ఇక్షిత, లలితమ్మ, సుదర్శన్‌రెడ్డి, శ్రీవాసవి, జస్వంత్ రెడ్డి, వేదాన్సి పాల్గొన్నారు.


