పరిష్కారం శూన్యం.. సమస్యలు పదిలం
వికలాంగ పెన్షన్ మంజూరుచేయాలి
పొలానికి దారి ఇప్పించండి
● పీజీఆర్‌ఎస్‌లో పదే పదే అర్జీలు ఇస్తున్నా ఫలితం శూన్యం
● పెన్షన్లు, రెవెన్యూ సమస్యలే అధికం
● ప్రజా సమస్యలపై 266 అర్జీలు
సాక్షి, అన్నమయ్య : ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితు లు బారులు తీరుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడ నే ఉంటున్నాయి. వినతిపత్రాలు ఇచ్చే వారి కష్టాలు తీరడం లేదు. కలెక్టర్ నిషాంత్‌కుమార్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నా కిందిస్థాయి యంత్రాంగంలో చిత్తశుద్ధి లో పించడంతో ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు.
కూటమి ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక మొక్కుబడి తంతుగా మారింది. సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముకుని వచ్చే ప్రజలకు నిరాశే మిగులుతోంది. అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పితే, ఇప్పటివరకు పరిష్కారమైన దాఖలాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులందరూ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, సర్వే ఏడీ భరత్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.
భారీగా వినతులు
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రెండోసారి సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి భారీగా వినతులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సమస్యలపై 266 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి వినతిపత్రాలు సమర్పించారు. ప్రధానంగా రెవెన్యూ పరమైన పెన్షన్లు, కబ్జాలు లాంటి వాటిపైనే పెద్ద ఎత్తున వినతులతో ప్రజలు తరలివచ్చారు. వచ్చిన దరఖాస్తుదారులే పదేపదే మళ్లీ వచ్చారు. పరిష్కారం ల భించకపోవడం ఆందోళన కలిగించే పరిణామం.
ఒక్కొక్క అర్జీ రూ.100
జిల్లాలోని బాధితులు తమ గోడు ఉన్నతాధికారులకు చెప్పి సమస్య పరిష్కరించుకుందామని వస్తున్నవారి ఆవేదనను కొంతమంది వినతులు రాసే వారు సొమ్ము చేసుకుంటున్నారు. దరఖాస్తుదారుని బాధను పేపరులో నమోదు చేయడానికి రూ. 100 తీసుకుంటుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తయితే, ఇక్కడ టిఫిన్, భోజన ఖర్చులు మొదలుకొని మళ్లీ అర్జీ రాసినందుకు ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సి రావడం బాధాకరం. సాధారణంగా ఒక అర్జీ రాసేందుకు గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి, వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో రూ. 30 తీసుకునేవారు. అయితే ప్రస్తుతం అర్జీ రాసేందుకు ఒక్కసారిగా రూ. 100లు ఇవ్వాల్సి రావడంతో పలువురుబాధితులు వారితో గొడవకు దిగుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని..ఇలా పెద్ద మొత్తంలో తీసుకుంటే మేమే ఇక్కడ కూర్చొని తక్కువ మొత్తానికి, లేకుంటే ఉచితంగా అర్జీలు రాసిస్తామంటూ ఓ మాజీ సైనికుడు వారితో వాద నకు దిగారు. అయినా అర్జీ రాసేవారిలో మార్పు కనిపించడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక చర్య లు చేపట్టి అర్జీ రాసే వారు నామమాత్రపు సొమ్ము తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు
నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన పిల్లి మల్లీశ్వరి దివ్యాంగుడైన తన తొమ్మిదేళ్ల కుమారుడికి పెన్షన్ మంజూరుచేయాల్సిందిగా కలెక్టర్‌కు అర్జీ సమర్పించింది. కాళ్లు చచ్చుపడిపోయి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడి పోషణ కోసం వికలాంగ పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా వేడుకుంది.
మదనపల్లె మండలం సర్వే నం.367/1క్యూలోని తమ భూమికి వెళ్లేందుకు పక్క భూమి వారు దారి ఇవ్వడం లేదని మనేరి చలపతి అర్జీ సమర్పించారు. 1957 నుంచి కొండ వంకకు పూర్వీకులు బండిబాటగా వినియోగిస్తున్న దారి ఉన్నప్పటికీ, భూమిని ఆక్రమించుకుని తొమ్మిదేళ్లుగా తమతో పాటు ఇతర రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదుచేశారు. పొలానికి వెళ్లేందుకు దారి ఇప్పించి, రైతులకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు.
పరిష్కారం శూన్యం.. సమస్యలు పదిలం
పరిష్కారం శూన్యం.. సమస్యలు పదిలం


