నీరుగారిన..ఉత్సవం
జమ్మలమడుగు/జమ్మలమడుగురూరల్ : గండికోట ఉత్సవాలు వెలవెలబోతున్నాయి. గండికోట వైభవాన్ని.. కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్న అధికారులు ఆదిశగా అడుగులు వేయలేదు. కోట వైభవం మాటేమోగానీ ఉత్సవాలతో కొంచైమెనా ప్రయోజనం జరగకపోగా.. చుట్టూ పారిశుధ్య లేమితో.. నిరు పయోగంగా మారిన తాగునీటి నిర్వహణ కేంద్రాలతో కోట పేరును గంగలో కలిపేస్తున్నారు. తొలి రోజు పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉన్నా దానికి తగ్గట్టుగా ప్రోగ్రాంలు సక్రమంగా నిర్వహించడంలో అధికారులో వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
స్థానికులు ప్రాధాన్యత ఎక్కడా...!
ఉత్సవాలలో స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాల విద్యార్థులతో కల్చరల్ యాక్టివిటిస్ నిర్వహించేవారు. ఈ ఏడాది భాగస్వామ్యం కాదుకదా వారికి కనీస పిలుపే లేకుండా పోయింది. సోమవారం జరిగిన కార్యక్రమాలు సైతం వెలవెలబోయాయి. పట్టుమని పదిమంది కూడా కూర్చిలో కూర్చొలేని పరిస్థితి ఉంది.
వెలవెలబోతున్న స్టాల్స్...
గండికోట ఉత్సవాల్లో భాగంగా చేనేతవృత్తుల, వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్‌లు కొనుగోలు దారులు లేక వెలవెలబోయాయి. మూ డు రోజుల పాటు గండికోట ఉత్సవాలలో జిల్లాకు సంబంధించిన చేనేత వృత్తుల ప్రదర్శన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. స్టాల్స్‌లో ముతక వస్త్రాలు చూసి ఉస్సూరుమన్నారు.
తాగునీరు లేక ఇబ్బందులు...
గండికోట ఉత్సవాలను చూడటానికి వచ్చిన పర్యాటకులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా అధికారులు కల్పించలేదు. అలాగే మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో తలుపులకు తాళాలు వేశారు. మరుగుదొడ్లు వసతులు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


