నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్టు
● రెండు కిలోల నకిలీ బంగారు స్వాధీనం
● రూ.3 లక్షల నగదు, కారు స్వాధీనం
రాయచోటి : నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ముఠాను రాయచోటి రూరల్ పరిధిలోని చిన్నమండెం పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎస్‌కె రోషన్ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి రెండు కిలోల నకిలీ బంగారం, రూ. 3 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రాయచోటి రూరల్ పోలీసు స్టేషన్‌లో చిన్నమండెం ఎస్‌ఐ సుధాకర్‌తో కలిసి సిఐ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం, తంజావూరుకు చెందిన బంగారు వ్యాపారులకు రెండు కిలీల నకిలీ బంగారాన్ని విక్రయించి మోసం చేశారన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ బంగారం విక్రయిస్తున్న వారిపై చిన్నమండెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందన్నారు. సమాచారం మేరకు చిన్నమండెం సమీపంలోని కేశాపురం చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో కారుతోపాటు శాంపిల్‌గా ఉన్న 170 మిల్లీ గ్రాముల బంగారం, నగదును స్వాధీనం చేసుక్నునామన్నారు. వీరబల్లి మండలం, షికారుపాలెంకు చెందిన నలుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి నకిలీ బంగారు విక్రయంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్‌ల ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వివరించారు.


