రోడ్డు ప్రమాదంలో జవాన్ ఆకస్మిక మృతి
కురబలకోట : దేశ రక్షణలో సేవలందిస్తున్న ఓ జవాన్ రోడ్డు ప్రమాదంలో టిప్పర్ ఢీకొని ప్రాణాలు కోల్పోవడం మండలంలో తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. సోమవారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..మండలంలోని తూపల్లికి చెందిన ఎన్. రాజశేఖర్ రెడ్డి (31) ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఇతను ఇటీవల శిక్షణ నిమిత్తం బెంగళూరుకు వచ్చాడు. అస్వస్థతకు గురై చికిత్స పొందిన అతను అక్కడ నుంచి మూడు రోజుల క్రితం సెలవులో స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి సమీపంలోని ముదివేడు నుంచి స్వగ్రామం తూపల్లికి మోటార్ సైకిల్‌పై వెళుతుండగా ఎనుములవారపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సంక్రాంతి సందర్భంగా ఆనందంగా గడపాల్సిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడం కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. అతనికి భార్య రుక్మిణి, కుమార్తె ఊర్వి (3) ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో జవాన్ ఆకస్మిక మృతి


