నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లె రూరల్: ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వేర్వేరుగా పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్, మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులు, ఫిర్యాదుదారులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు రైతులందరికీ పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ అలసత్వం వహించడంతో తొండూరు తహసీల్దార్ రామచంద్రుడును సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, వీఎన్ పల్లె, గో పవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, బి.మఠం, ప్రొద్దుటూరు, సీకే దిన్నెమండల తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్లు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని గమనించకుండా, సరైన రీతిలో పర్యవేక్షించని కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్, పులివెందుల రెవెన్యూ డివిజన్ అధికారి చిన్నయ్యలకు మెమోలు జారీ చేశారు.
మదనపల్లె సిటీ: సంక్రాంతి స్పెషల్స్ బస్సులు నడపడం వలన మదనపల్లె ఆర్టీసీ–1డిపోకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 10వతేదీన డిపో నుంచి హైదరాబాదు, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఒక్క రోజుకే రూ.23.34 లక్షల ఆదాయం వచ్చినట్లు డీఎం మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈపీకే 50.49, ఓఆర్ 92 వచ్చిందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టుకుని ప్రత్యేక సర్వీసులు నడిపినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో ఆదాయం రావడంపై డ్రైవర్లు, కండక్టర్లు, ట్రాఫిక్, గ్యారేజీ సిబ్బంది, సూపర్‌వైజర్లు, అద్దె బస్సు సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఆన్‌కాల్ డ్రైవర్లుకు అభినందలు తెలిపారు.
మదనపల్లె సిటీ: పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లును సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలని ఏపీ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.మునిగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక జీఆర్‌టీ ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజెన్స్ సమావేశం జరిగింది. ఆదిత్య కాలేజీ అధ్యాపకురాలు అరుణ పలువురి సీనియర్ సిటిజెన్స్‌కు లైఫ్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో చేశారు. బీటీ కాలేజీ పూర్వపు విద్యార్థి స్కూల్‌లైఫ్ సినిమాలో విలన్‌గా నటించినందుకు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మునిరత్నమయ్య, ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్, కోశాఽధికారి ఉస్మాన్‌సాహెబ్, మహిళా ప్రతినిధి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముద్దనూరు: స్థానిక రైల్వేస్టేషన్‌లో ధర్మవరం–మచిలీపట్నం రైలుకు స్టాపింగ్ సౌకర్యం కల్పించడంతో ఆదివారం స్థానిక ప్రజలు ఈ రైలుకు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉద యం స్థానిక స్టేషన్లో తొలిసారి ఆగింది. దీంతో మండలంలోని ప్రముఖులు, వ్యాపారులు, విద్యార్థులు, ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లో ఆగిన రైలును మామిడాకులు,పూలదండలతో అలంకరించారు. ఈ సందర్భంగా రైలు లోకో పైలెట్‌లకు సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ముద్దనూరులో రైలు స్టాపింగ్‌కు కృషిచేసిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మండలఅధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక


