108 ఉద్యోగుల సమ్మె బాట
మదనపల్లె సిటీ : అత్యవసర వైద్యం అందించే 108 వ్యవస్థ, ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. అపద్భాంవులపై అక్కసు ప్రదర్శిస్తోంది. ఎమర్జన్సీ వైద్యం అందించే ఉద్యోగులపై నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తోంది. గతంలో వేతన నిధులు మంజూరు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తోంది. ఆరు నెలలుగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది. దీంతో వారందరూ సమ్మెబాట పట్టనున్నారు.
12 వరకు డెడ్‌లైన్
108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే సమ్మెబాట పడతామని స్పష్టం చేశారు. ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. అప్పటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లనున్నామని 108 ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులతోపాటు కాంట్రాక్టు సంస్థకు కూడా సమ్మె నోటీసులను పలు దఫాలుగా అందజేశారు.
గద్దెనెక్కిన నాటి నుంచి..
చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి 108 ఉద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సంస్థను మార్చడం మొదలు, పెంచామన్న జీతం జీవోకే పరిమితమవ్వడం, వైట్ యాఫ్రాన్ బదులు డ్రెస్‌కోడ్ మార్చడం, ఆరు నెలలుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో వారికి సమ్మె అనివార్యంగా మారింది. ఇటీవల ఒకసారి చర్చలు జరిగినప్పటికీ అందులో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో.. వారు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు.
డిమాండ్లు
● 108 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.4 వేలల్లో రూ. 2 వేలు మాత్రమే పెంచారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్‌ఎఫ్‌పీ ప్రకారం ఈపీఎఫ్‌ఓ యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని చెప్పినా నేటీకీ అమలు కాలేదు.
● చిన్న కారణాలను చూపిస్తూ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం మానుకోవాలి.
● ఈఎంటీలను ట్రైనింగ్ పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ట్రైనింగ్ అంటే ఉన్న నాలెడ్జ్‌ని పెంపొందించాలే తప్ప భయభ్రాంతులకు గురి చేస్తూ ఫెయిల్ అయితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పడం దారుణం.
● ప్రతి అంబులెన్స్ ఉన్న చోట సిబ్బంది ఉండేందుకు వసతి, వాహనం నిలుపు కొనేందుకు పక్కా షెడ్డు నిర్మించాలి.
● వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి.
● భవ్య సంస్థ 108 బాధ్యత తీసుకుని ఏడు మాసాలు పూర్తయినా ఏ ఉద్యోగికి అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వలేదు. వేతనాలపై సైతం స్పష్టత లేకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
● 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆటోమెటిక్ శ్లాబ్ అప్‌గ్రేడ్ చేయాలి. పనిష్‌మెంట్ కాలాన్ని చూపుతూ వేతనం తగ్గించడం తగదు. శ్లాబ్‌కు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి.
● కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న గత సర్వీస్ ప్రొవైడర్ రిలీవింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. గతంలో మాదిరిగా షిఫ్ట్‌నకు రూ.200 ఇవ్వాలి.
● కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరహా పండుగ ప్రయోజనాలు కల్పించాలి.
● వాహనాల్లో అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలి.
● ఐఎఫ్‌టీ కేసుల్లో సరైన గైడెన్స్ రూపొందించి మెడికల్ ఆఫీసర్లకు, 108 సర్వీస్ ప్రొవైడర్లకు తెలపాలి.
అధికారులు, కాంట్రాక్టు కంపెనీకి
నోటీసులు
డిమాండ్లు పరిష్కరించకుంటే
12 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి
జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు
108 ఉద్యోగుల సమ్మె బాట
108 ఉద్యోగుల సమ్మె బాట


