ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!

Jan 12 2026 7:23 AM | Updated on Jan 12 2026 7:23 AM

ప్రైవ

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!

అధికారుల హెచ్చరికలు బేఖాతరు

మదనపల్లె రూరల్‌: సంక్రాంతి వచ్చిందంటే చాలు పండగంతా ప్రైవేటు ట్రావెల్స్‌దే. సీజన్‌లో దొరికిందే తడవుగా చార్జీల పేరుతో ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. దీంతో పండుగ ప్రయాణాలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లలో రెండు నెలల ముందే రిజర్వేషన్లు ముగియడం, ఆర్టీసీ సైతం అవసరానికి తగినన్ని బస్సులు నడపకపోవడంతో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఒక్కో ట్రావెల్స్‌ నిర్వాహకులు ఒక్కో విధంగా ప్రయాణికుల దోపిడీయే లక్ష్యంగా టిక్కెట్‌ ధర నిర్ణయించారు. సాధారణ టిక్కెట్టు ధర కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా టిక్కెట్‌ రేట్లను పెంచేశాయి. పెరిగిన టిక్కెట్‌ ధరలతో బేజారెత్తిపోతున్న జనం కళ్లల్లో సంక్రాంతి కాంతులు కళా విహీనంగా కనిపిస్తోంది.

అధిక వసూళ్లు

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు రావాలనుకునే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధి, చదువుల కోసం హైదరాబాదు, విజయవాడ, చైన్నె, బెంగుళూరులో ఉంటున్న జిల్లా వాసు లు పండక్కి ఇంటికి రావాలంటే భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ముందుగా ప్లాన్‌ చేసుకున్న వారంతా రైళ్లకు బుకింగ్‌ చేసుకున్నారు. సెలవు దొరుకుతుందో లేదో అని వెయిట్‌ చేసి చివరి నిమిషంలో ప్రయాణానికి సిద్ధ్దమైన వారి పరిస్థితి దారుణంగా ఉంది.

రైళ్లలో అడుగు పెట్టలేని పరిస్థితి

ఇక రైలు ప్రయాణం గురించి ఆలోచన మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు వివిధ నగరాల నుంచి వచ్చే రైళ్లకు సంబంధించి రెండు నెలల ముందే రిజర్వేషన్లు క్లోజ్‌ అయ్యాయి. కనీసం వెయిటింగ్‌ లిస్టు కూడా దొరకడం లేదు. పోనీలే జనరల్‌ బోగీల్లో వద్దామనుకుంటే అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు ప్రయాణం ఆలోచనలను విరమించుకోవాల్సి వస్తోంది.

చార్జీ రెట్టింపు..

మామూలురోజుల్లో హైదరాబాద్‌ నుంచి మదనపల్లెకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఏసీ స్లీపర్‌ బస్సులో రూ.1,450, సీటర్‌..800–900 ఉండేది. ప్రస్తుతం హైదరాబాదు నుంచి మదనపల్లెకు 12వ తేదీ ప్రయాణానికి ఆన్‌లైన్‌లో చెక్‌చేస్తే... 4 ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. వాటిలో చార్జీ రూ.867 ఉంది. అదే ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సుల విషయానికి వస్తే.. ఒక్కో బస్సులో ధర ఒక్కో విధంగా ఉండటమే కాకుండా, స్లీపర్‌, సీటర్‌ ఒకే చార్జీలు ఉంటున్నాయి. వాటి ధరలను పరిశీలిస్తే...రూ.1,300 నుంచి 1,800 వరకు ఉంటున్నాయి. లక్షల జీతాలు సంపాదించే సాఫ్ట్‌వేర్లకు టికెట్‌ ధరలతో పెద్ద సమస్య ఉండకపోవచ్చు కానీ, ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలసవెళ్లి పండుగకు సొంతూరికి రావాలనుకున్న బడుగు జీవులకు ప్రయాణం భారమవుతోంది. కష్టార్జితంలో చాలావంతు చార్జీలకే సరిపోతోంది.

గమ్యస్థానం చేరకుండానే మధ్యలో...

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి పుంగనూరుకు బస్సు రిజర్వేషన్‌ చేసుకుని రూ.1,700 టికెట్‌ ధర చెల్లించినప్పటికీ, బస్సు యాజమాన్యం మదనపల్లెకు వచ్చాక వారిని ఆర్టీసీ బస్సులో వెళ్లాల్సిందిగా బస్టాండ్‌ ఎదుట దింపేశారు. ఎందుకని ప్రశ్నిస్తే.. బస్సు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లి రాత్రికి లోడ్‌ చేసుకోవాల్సి ఉందని, సర్దుకుపోండని సమాధానమిచ్చారని ప్రయాణికులు వాపోయారు. చేసేదిలేక లగేజీ మోసుకెళ్తూ వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సులు, రైళ్లలో ఖాళీలేక ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న జనం

అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోచుకుంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌

హైదరాబాదు, విజయవాడ నుంచి రావాలంటే పెద్ద మొత్తంలో వసూలు

దోపిడీపై పట్టీపట్టనట్లు వ్యవహరించిన కూటమి సర్కార్‌

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!1
1/3

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!2
2/3

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!3
3/3

ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement