
మహిళా సాధికారతే లక్ష్యం
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి జగదాంబసెంటర్: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లో మంత్రి మండిపల్లి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జిల్లాలో వివిధ ఎస్‌హెచ్‌జీ గ్రూపుల నుంచి ఎంపిక చేసిన 10 గుడ్ల అమ్మకపు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వల్లే మహిళా సాధికారత సాధ్యమైందన్నారు. మహిళా సంఘాలకు అందజేసిన గుడ్ల అమ్మకపు బండ్లు పౌష్టికాహారంతో పాటు గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కలిగిస్తాయన్నారు. ఒక్కో బండికయ్యే ఖర్చు రూ.50 వేలని, దీనిని ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు పౌష్టికాహారాన్ని అందివ్వడం, గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కలిగించడం కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, జాతీయ గుడ్డు సమన్వయ కమిటీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు ఈ గుడ్ల అమ్మకపు బండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 2025–26లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మొత్తం వెయ్యి ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లోని ఒక్కో సభ్యురాలికి ఒక గుడ్డు అమ్మకపు బండి చొప్పున సరఫరా చేయనున్నారన్నారు. మొదటి దశలో జిల్లాకు 10 గుడ్డు అమ్మకపు బండ్లు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, లబ్ధిదా రులు పాల్గొన్నారు.