తన్నుకున్న తమ్ముళ్లు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని చల్లనికొండ హార్సిలీహిల్స్‌పై టీడీపీ తమ్ముళ్ల మధ్య డిష్యూం డిష్యూం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి సమావేశంలో ఉండగానే.. వెలుపల ఇరువర్గాలు ఉద్రిక్తత సృష్టించేలా వ్యవహరించడం మంత్రికి చిరాకు తెప్పించడంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఆదివారం రహదారి భవనాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నిర్వహించిన టీడీపీ నేతల సమావేశం సందర్భంగా.. మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జయచంద్రరెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఎంపిక చేసిన నాయకులతో సమావేశం ఉంటుందని ముందుగా చెప్పిన నిర్ణయం మార్చుకుని.. మండలాల వారీగా అందరికీ అవకాశం కల్పించడంతో పరిస్థితి గందరగోళానికి దారితీసింది.
కేఎస్‌ఎస్‌ల నియామకం
పార్టీ చూసుకుంటుందని చెప్పిన మంత్రి
హార్సిలీహిల్స్‌పై ఆరు మండలాలకు చెందిన మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఇన్‌చార్జ్‌లు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన ఓ ప్రయివేటు సమావేశ హాలులో మంత్రి జనార్దన్‌రెడ్డి, జోన్‌ఫోర్ ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రాజు, పరిశీలకుడు గురువారెడ్డి హాజరయ్యారు. దీనికి ముందు జయచంద్రారెడ్డి వర్గంతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. తర్వాత ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డిని ఈ సమావేశానికి దూరంగా పెట్టారు. తొలుత పెద్దమండ్యం మండల నేతల సమావేశంలో కన్వీనర్ బిల్డర్ రమణ పార్టీలో కష్టపడి పని చేసినా గుర్తింపులేదని, తమను ఇన్‌చార్జ్ పట్టించుకోవడం లేదంటూ ఏకరువు పెట్టారు. మిగిలిన కొందరు నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత తంబళ్లపల్లె మండల సమావేశంలో రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ములకలచెరువు సమావేశంలో కన్వీనర్ పాలగిరి సిద్దా తమ ఇబ్బందులపై ఏకరువు పెట్టారు. అందులో కేఎస్‌ఎస్ సభ్యుల ప్రస్తావన చేయడంతో.. ఈ నియామక ప్రక్రియను పార్టీ చూసుకుంటుందని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. శంకర్ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఇలా సమావేశం జరుగుతుండగా వెలుపల భారీసంఖ్యలో రెండు వర్గాలు మోహరించి ఉన్నాయి. హాలు వద్ద రెండు వర్గాలు ఎదురెదురుగా ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా శంకర్ వర్గీయులు తాము పా ర్టీకి కష్టపడి పని చేశామని, గుర్తింపు లేదని దీపక్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. అంతలో రెండు వర్గాలు అరుపులు, కేకలు, ఈలలు వేయడంతో ఒక్కసారి రెండు వర్గాలకు తలపడే పరిస్థితి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ పరిస్థితిపై అసహనానికి గురైన మంత్రి జనార్దన్‌రెడ్డి అందరిన్నీ ఆహ్వానిస్తే ఇలా వ్యవహరించడం తగదు అంటూ మిగిలిన బి.కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రం మండలాల సమావేశాలను రద్దు చేసుకుని బయటకు వచ్చేశారు. సమావేశం నుంచి మంత్రి బిరాబిరా వెళ్లిపోయారు. వెళ్తున్నట్టు కానీ, సమావేశాలు ముగించామని గానీ చెప్పలేదు. అందరి అభిప్రాయాలను కూడా తెలుసుకోలేదు. ఆయనతోపాటు మిగిలిన నేతలు హార్సిలీహిల్స్ నుంచి వెళ్లిపోయారు.
మంత్రి సమక్షంలో జేసీఆర్, శంకర్ వర్గాల బలప్రదర్శన
మంత్రి నిర్ణయమే కారణం
తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి సమావేశానికి వచ్చే పార్టీ నాయకుల జాబితాను పోలీసులకు అందజేశారు. అందులో 26 మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. వీరిని మాత్రమే హార్సిలీహిల్స్‌కు పంపాల్సి ఉండగా పోలీసులు ఇదే పని చేశారు. కొండ కింద అను మతి లేని వారిని నిలిపివేశారు. అయితే మంత్రి జనార్దన్‌రెడ్డి అందర్నీ పంపండని, వారిని తనిఖీ కూడా చేయెద్దు అంటూ పోలీసులను ఆదేశించారు. దీనితో కొండ కింద నుంచి, సమావేశానికి హాజరయ్యే నేతల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోలేదు. ఈ వ్యవహారం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.


