నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
రాయచోటి టౌన్: బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు. తమ వినతి పత్రాలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.
జీఐపీకేఎల్‌లో రాయచోటి వాసి
రాయచోటి జగదాంబసెంటర్: రాయచోటి పట్టణం బోస్‌నగర్‌కు చెందిన అలీ అహమ్మద్(22) ఈ నెల 18, 19, 20వ తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించే కబడ్డీ జీఐపీకేఎల్(గ్లోబల్ ఇండియా ప్రవాసి కబడ్డీ లీగ్)లో లయన్స్ తమిళ్ టీం తరఫున ఆడనున్నారు. ఈయన రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. అలీఅహమ్మద్ చిన్ననాటి నుంచే కబడ్డీ ఆట ఆడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లేవాడని అతని తండ్రి షబ్బీర్ తెలిపారు. విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించిన ఆ యువకుడికి రాయచోటి, జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. రానున్న రోజులలో అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు
సిద్దవటం: సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గొల్లపల్లె, రోళ్లబోడు, సిద్దవటం బీట్లలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ ఆదివారం తనిఖీలు చేపట్టారు. అనంతరం రోళ్లబోడు బేస్ క్యాంప్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంపద తరలిపోకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీలు చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల పట్ల వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి తొట్లలో తాగునీరు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం రేంజర్ బి.కళావతి, డీఆర్‌ఓ ఓబులేష్, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు


