రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో రాజకీయ దొంగలు పడి ప్రజల సొమ్మును దోచుకు తింటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు. శనివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అతని అనుచరులు చేస్తున్న దోపిడీ, అరాచక పాలనను ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణంలో పాల్గొంటే రాయచోటిలో మంత్రి అనుచరులు దొంగతనాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రోడ్డు నిర్మాణం సామగ్రిని దొంగిలించే టిప్పరు, జేసీబీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే గంట తిరగకముందే ఆ టిప్పర్, జేసీబీ కనబడటం లేదన్నారు. రాజకీయ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ యంత్రాంగాన్ని సైతం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. దోపిడీ చేసుకెళ్తున్న సంఘటనపై మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదునే పట్టించుకోని పోలీసులు సామాన్య ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ఎంత వరకు విలువ ఇస్తారో అర్థమవుతోందన్నారు.
40 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో చిల్లర నేతలకు ఎన్నికల్లో అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోందన్నారు. తమ క్రషర్‌పై కేసు రాయించి రూ.12 కోట్లు అపరాధ రుసుము వేశారన్నారు. తన క్రషర్ కేసును చూపిస్తూ మిగిలిన క్రషర్ యజమానుల నుంచి గత నాలుగు నెలలుగా లక్షలాది రూపాయల మామూళ్లు వసూలు చేస్తున్నారని మంత్రిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాత్రం పరిశ్రమలు తెస్తా, ఉపాధి కల్పిస్తా అంటూ చెబుతుండగా స్థానిక మంత్రి దాడులు, దోపిడీలతో వందల మందికి ఉపాధి కోల్పోయేలా జిల్లాలో పరిస్థితులను తీసుకొచ్చారన్నారు. ఏ సమయంలో ఎవరి స్థలం కబ్జా చేస్తారో.. ఎవరి మీద దాడులు చేస్తారో.. అన్న భయంతో ప్రజలు జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో తొలి ఏడాదిలోనే విపత్కర పరిస్థితులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించారన్నారు. గత పది నెలల కూటమి పాలనను చూసిన ప్రతి కుటుంబం జగన్‌మోహన్‌రెడ్డిని తలుచుకుంటోందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి 2.0 ఫార్ములా అందరి జీవితాలను ఉన్నత స్థానంలో ఉండేలా మారుస్తుందన్నారు. బీజేపీ, జనసేనలు కూటమిలో నామమాత్రమే అన్నారు. పవన్ కళ్యాణ్ సత్తా లేని మనిషిగా మిగిలిపోయారన్నారు. పోలీసులను వాడుకొని జూదం కేంద్రాలు నిర్వహించి తద్వారా లక్షల రూపాయలను మంత్రి మండిపల్లి, అతని అనుచరులు గడించారన్నారు. జిల్లా కేంద్రంలో తహసీల్దార్ స్థానంలో అర్హత లేని డీటీని నియమించి ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అరాచకాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రమేష్ కుమార్‌రెడ్డి ఫైర్


