తాడిపత్రిలో జేసీ దౌర్జన్యం.. ఎస్పీకి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు | YSRCP Leaders Petition To SP Jagadeesh Over JC Prabhakar Issue | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో జేసీ దౌర్జన్యం.. ఎస్పీకి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

Jun 30 2025 1:30 PM | Updated on Jun 30 2025 3:05 PM

YSRCP Leaders Petition To SP Jagadeesh Over JC Prabhakar Issue

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేతల బృందం అనంతపురం ఎస్పీ జగదీష్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీకి తాడిపత్రిలోని పరిస్థితులను వివరించారు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని వినతి పత్రం అందజేశారు. ఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు.

అనంతరం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం లేదు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలి. తాడిపత్రిలో నియంత పాలన జరుగుతోంది. పెద్దారెడ్డిపై ఆంక్షలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘నేను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తగిన భద్రత కల్పించాలని రెండు మాసాల కిందటే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రపా.. రపా.. నరుకుతానంటూ జేసీ బెదిరిస్తున్నారు. నాకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులు జరుగుతున్నాయి. హింసకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి దుక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేది. కేవలం మున్సిపల్ చైర్మన్ జేసీ చెబితే పోలీసులు నడుచుకోవటం హాస్యాస్పదం. నాపై చేస్తున్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధం’ అని సవాల్‌ విసిరారు.

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెంటనే తాడిపత్రిలోకి అనుమతించాలి. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు అమలు చేయకపోవడం దుర్మార్గం. పెద్దారెడ్డి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య రాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతల దౌర్జన్యాలు దేనికి నిదర్శనం. ఓ మాజీ ఎమ్మెల్యేని ఏడాది కాలంగా అడ్డుకోవడం దేశంలో ఎక్కడైనా ఉందా?. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో తాడిపత్రిలో నిరంకుశ పాలన జరుగుతోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం’  అని అన్నారు.

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. పెద్దారెడ్డికి మద్దతు ఇచ్చే వారిని రప్పా.. రప్పా.. నరుకుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో హింసా రాజకీయాలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులను పోలీసులు పట్టించుకోరా?. పెద్దారెడ్డి తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళితే పోలీసులకు అభ్యంతరం ఏంటి?. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement