రాయ‌ల‌సీమ లిఫ్టును పూర్తి చేయాల్సిందే | Ysrcp Leaders Comments On Rayalaseema Lift Irrigation | Sakshi
Sakshi News home page

రాయ‌ల‌సీమ లిఫ్టును పూర్తి చేయాల్సిందే

Apr 22 2026 7:38 PM | Updated on Apr 22 2026 7:55 PM

Ysrcp Leaders Comments On Rayalaseema Lift Irrigation

సాక్షి, నంద్యాల‌ జిల్లా: రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును త‌క్ష‌ణం మొద‌లుపెట్టి ఎట్టిప‌రిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ నాయ‌కులు, రైతు నాయ‌కులు, రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్య‌ర్యంలో నంద్యాలలో జ‌రిగిన రాయ‌ల‌సీమ లిఫ్టు స‌మాలోచ‌న స‌మావేశంలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి చంద్ర‌బాబు చేస్తున్న ద్రోహంపై గ‌ళ‌మెత్తారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టు ఆవ‌శ్య‌క‌తతోపాటు కూట‌మి పాల‌న‌లో ఈ ప్రాంతానికి జ‌రుగుతున్న అన్యాయంపై గ్రామ స్థాయి నుంచే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేలా ప్ర‌ణాళిక రూపొందించాల‌ని తీర్మానించారు.

రాయ‌ల‌సీమ లిప్టుతోపాటు గుండ్రేవుల ప్రాజెక్టు, మ‌ల్లిఖార్జున రిజ‌ర్వాయ‌ర్లు కూడా పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం ఇచ్చిన జీవో నెంబ‌ర్ 98 అమ‌లు చేసి బాధిత కుటుంబాల‌కు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్ర‌భుత్వం స్పందించ‌కుంటే గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు. రాయలసీమ నీటి హక్కులు సాధించుకోవడం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు.

రాయ‌ల‌సీమ ప్రాజెక్టులు, ఈ ప్రాంత అభివృద్దిపై చంద్ర‌బాబుకి చిత్త‌శుద్ధిలేద‌ని, ఆయ‌న ఈ ప్రాంతంలో పుట్ట‌డం దౌర్భాగ్యమ‌ని నాయ‌కులు మండిప‌డ్డారు. త‌న పార్టీకి ఓట్లు వేయ‌డం లేద‌ని రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని చిన్న‌చూపు చూస్తున్న చంద్ర‌బాబు, త‌న సుదీర్ఘ‌ రాజ‌కీయ జీవితంలో రాయ‌ల‌సీమ‌కు ఏం చేశానో త‌న‌ను తానే ప్ర‌శ్నించుకోవాల‌ని సూచించారు.

రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్ స‌మాలోచ‌న కార్యక్ర‌మంలో నంద్యాల, నెల్లూరు జిల్లాల‌ వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, జిల్లా ప‌రిశీల‌కులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, కాట‌సాని రామిరెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి, మాజీ మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, సాకె శైల‌జానాథ్‌, నందికొట్కూరు స‌మ‌న్వ‌య‌క‌ర్త దారా సుధీర్‌, మాజీ ఎంపీలు త‌లారి రంగ‌య్య‌, పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎమ్మెల్సీలు క‌ల్ప‌ల‌తారెడ్డి, ఇసాక్ బాషాల‌తోపాటు రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు, రైతు సంఘాల నాయ‌కులు, వివిధ విభాగాలకు చెందిన వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, పాల్గొన్నారు.

రేవంత్‌తో చంద్ర‌బాబు చీక‌టి ఒప్పందం: కాటసాని రాంభూపాల్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి చంద్ర‌బాబు ద్రోహం చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమ అంటే చంద్రబాబుకు చులకన భావన ఉంది. రాయలసీమ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, రాయలసీమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాటం చేయాలి. 

ప‌సుపు పూలు చ‌ల్లి చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం లేక‌పోతే రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారే ప్ర‌మాదం ఉంది. 90 శాతం పనులు పూర్తి చేసి, యంత్ర సామాగ్రి సిద్ధం చేసిన ప్రాజెక్టును ప‌క్క‌న‌పెట్టేశాడు. 23 నెల‌ల్లో రూ. 3.56 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసిన చంద్ర‌బాబు, రాయ‌ల‌సీమ లిఫ్టు పూర్తి చేయ‌క‌పోవ‌డం రాయ‌ల‌సీమ ప్రాంతానికి ద్రోహం చేయ‌డ‌మే. వైయ‌స్ జ‌గ‌న్ కుప్పానికి నీళ్లిస్తే అది కూడా చంద్ర‌బాబు త‌న ఘ‌న‌తగానే చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. ప‌సుపు పూలు చ‌ల్లి క్రెడిట్ చోరీకి పాల్ప‌డుతున్న చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌లో పుట్ట‌డం మ‌న ప్రాంత ప్ర‌జ‌ల దౌర్భాగ్యం.

బాబు చేసిందేమీ లేదు: కాకాణి గోవ‌ర్థన్‌ రెడ్డి
రేవంత్‌రెడ్డి ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టం కోసం చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ లిఫ్టును తాక‌ట్టుపెట్టాడు. నిజం కాద‌ని మంత్రులు, కూట‌మి ఎమ్మెల్యేలు చెప్ప‌లేక‌పోతున్నారు. సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తెలంగాణ మీదున్న ప్రేమ చంద్ర‌బాబుకి ఏపీ మీద లేదని తేలిపోయింది. చంద్ర‌బాబు రోజురోజుకీ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. సాగునీటి రంగం గురించి కానీ, రైతుల గురించి కానీ ఏనాడూ చంద్ర‌బాబు ఆలోచ‌న చేసిన పాపాన పోలేదు.

చంద్ర‌బాబు సీఎంగా ఉంటే చ‌క‌చ‌కా ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌చ్చ‌ని ప‌క్క రాష్ట్రాలు సంబ‌రాలు చేసుకుంటాయి. రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు ఆగిపోతే ఆరు జిల్లాల ప్ర‌జ‌ల మ‌నుగడ ప్ర‌శ్నార్థకం అయ్యే ప్ర‌మాదం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు క‌ట్ట‌కుండా సాగునీటి భ‌ద్ర‌త‌- నీటి సంఘాల బాధ్య‌త అంటూ తెలుగుదేశం నాయ‌కులు జేబులు నింపే కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడు. ప్రాజెక్టులు మొద‌లుపెట్టి దోచుకోవ‌డం మిన‌హా చేసిందేమీ లేదు. తెలంగాణ‌కు ఎందుకు అమ్ముడుపోయాడో చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. కలిసొచ్చే వారితో ఉద్య‌మించి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్తును తిరిగి ప్రారంభించేలా పోరాడ‌దాం.

చంద్ర‌బాబుకి చిత్త‌శుద్ధి లేదు: బుగ్గన రాజేంద్రనాథ్‌
దేశంలోనే అత్యంత వెనుక‌బ‌డిన ప్రాంతం రాయ‌ల‌సీమ. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ ప్రాంత ప్ర‌యోజ‌నాల కోసం అంద‌రూ ఏకం కావాలి. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు నాకు ఓటెయ్య‌రు కాబ‌ట్టి, నేను రాయ‌ల‌సీమ‌కు ఏమీ చేయ‌న‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నాడు. 40 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉండి రాయ‌ల‌సీమ ప్రాంతానికి ఆయ‌న చేసిందేమీ లేదు. ఓటేసిన వారికే ప‌నిచేస్తాన‌ని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న చంద్ర‌బాబు చెప్ప‌డం క‌న్నా నీచం ఇంకోటి ఉండ‌దు. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో జ‌రిగిన మంచి ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.

కృష్ణా న‌ది మీద ఎగువ‌న ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు క‌ట్టుకుంటూ పోతే రాయ‌ల‌సీమకి నీరు ఎలా వ‌స్తాయ‌ని విజ‌న‌రీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు ఆలోచించ‌డం లేదు. రాయ‌ల‌సీమ అభివృద్ధి మీద చంద్ర‌బాబుకి చిత్త‌శుద్ధి లేదు కాబ‌ట్టే ఇవ‌న్నీ ప‌ట్టించుకోవ‌డం లేదు. వైయ‌స్సార్ గారు చేసిన ప్రాజెక్టుల‌ను నేనే చేశాన‌ని చెప్పుకుంటున్నాడు. రాయ‌ల‌సీమ స‌మ‌స్యల‌ గురించి ప‌ట్టించుకునే వాళ్లే క‌రువ‌య్యారు. చంద్ర‌బాబు మోసాల‌పై ప్ర‌తిఒక్క‌రూ ఇంటింటికీ వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పించాలి.

రాయ‌ల‌సీమ‌ను ఎడారిగా మార్చే కుట్ర‌: సాకే శైల‌జానాథ్‌
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సీఎం చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. రాయ‌ల‌సీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న కూట‌మి నాయ‌కులకు ఖ‌చ్చితంగా బుద్ధి చెబుతాం. వారు ఇప్ప‌టికైనా రాయ‌ల‌సీమ ద్రోహి చంద్ర‌బాబును నిల‌దీయాలి. 20 టీఎంసీలు దేనికి ప‌నికొస్తాయ‌ని చంద్రబాబు చెప్ప‌డం సిగ్గుచేటు. పంట‌లు పండ‌క రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారితే ఈ భూముల‌న్నీ ఎక‌రం 99 పైస‌ల‌కు అమ్ముకోవాల‌ని చంద్ర‌బాబు కుట్ర చేస్త‌న్నాడు. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. రాయ‌లసీమ రైతులు వ‌ల‌స వెళ్లి కూలీలుగా మారే ప‌రిస్థితికి ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పెట్టాలి.

గ్రామ స్థాయి నుంచి రిలే నిరాహార దీక్ష‌లు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి
చంద్ర‌బాబు త‌న వ్య‌క్తిగ‌త ప్రయోజ‌నాల కోస‌మే రాయ‌ల‌సీమ లిఫ్టును తాక‌ట్టుపెట్టాడు. ఎన్జీటీ అనుమ‌తులు లేవ‌నేది కేవ‌లం సాకు మాత్ర‌మే. గ‌తంలో ప‌ట్టిసీమ ప్రాజెక్టును చంద్ర‌బ‌బు ఎన్జీటీ అనుమ‌తులు లేకుండానే మొద‌లుపెట్టాడు. తెలంగాణ‌లో ఎన్నో ప్రాజెక్టులకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేకుండానే శ‌ర‌వేగంగా సాగుతున్నా చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేదు. రాయ‌ల‌సీమ‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతున్నా చంద్ర‌బాబుకి ప‌ట్ట‌డం లేదు. గ్రామ స్థాయి నుంచి రాయ‌లసీమ లిఫ్టు ఇరిగేష‌న్ సాధ‌న కోసం స‌మిష్టిగా ఉద్య‌మించాల్సిన అస‌వ‌రం ఉంది.

అందుకోసం గ్రేట‌ర్ రాయ‌ల్ సీమ వ్యాప్తంగా గ్రామ‌, మండ‌ల, జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్ష‌లు చేప‌ట్టి ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచాలి. దీంతోపాటు ప్రాజెక్టు ఆవ‌శ్య‌క‌త‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి కృషి చేయాలి. సిద్ధేశ్వ‌రం అలుగు పేరుతో గ‌తంలో హ‌డావుడి చేసిన బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న కుమార్తెకు ఎంపీ ప‌ద‌వి రాగానే నోరు తెర‌వ‌డం లేదు. రాయ‌ల‌సీమ లిప్టు కోసం వైఎస్‌ జ‌గ‌న్‌ చేసిన కృషిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి. పెండింగ్ ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేయ‌డం చేత‌కాని చంద్ర‌బాబు, పోల‌వ‌రం- బ‌న‌క‌చ‌ర్ల అంటూ ప్ర‌జ‌ల‌కు అబ‌ద్ధాలు చెబుతున్నాడు. రైతుల‌కు మేలు జ‌ర‌గాలంటే రాయ‌ల‌సీమ లిఫ్టుని సాధించుకోవాల్సిందే. రాయ‌ల‌సీమ లిఫ్టుపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌ర‌గాలి.

చంద్ర‌బాబు రాయ‌లసీమ ద్రోహి:  ఎమ్మెల్సీ ఇసాక్ బాషా
నేను అడ‌గ‌డం వ‌ల్లే చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ స్కీమ్‌ను ఆపేశాడ‌ని రేవంత్ రెడ్డి చెప్పాడు. రాయ‌ల‌సీమ‌లో పుట్టి ఈ ప్రాంతానికి చంద్ర‌బాబు తీర‌ని ద్రోహం చేస్తున్నాడు. రాయ‌ల‌సీమ బిడ్డ‌ల కోసం మ‌నం ఉద్య‌మించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. చంద్ర‌బాబు చేస్తున్న ద్రోహాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి. ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేదాకా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తాం.

ప్ర‌భుత్వం మ‌న‌సు పెడితే ఏడాదిలోపు ప్రాజెక్టు పూర్తి: దారా సుధీర్‌
వైఎస్సార్సీపీ హ‌యాంలోనే రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టులో 90 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన యంత్ర‌ సామాగ్రిని కూడా వైఎస్‌ జ‌గ‌న్ స‌మ‌కూర్చారు. చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రెండేళ్లుగా ఈ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టేశాడు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్‌ జ‌గన్‌కి మంచి పేరొస్తుంద‌నే ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మ‌న‌సుపెడితే మిగిలిన 10 శాతం ప‌నులు ఏడాదిలోపే పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావొచ్చు.  

వ్య‌వ‌సాయం, రైతులంటే చంద్ర‌బాబుకి అస‌హ్యం: పోచ్చా బ్ర‌హ్మానంద‌రెడ్డి
చంద్ర‌బాబు సాగునీటి ప్రాజెక్టుల‌ నిర్మాణం గురించి ఎప్పుడూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. రైతుల‌న్నా, వ్య‌వ‌సాయమ‌న్నా చంద్ర‌బాబుకి న‌చ్చ‌దు. ఘోర‌క‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ సాధ్యం కాద‌ని గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం తేల్చేసింది. కానీ వైయ‌స్సార్ సీఎం అయ్యాక సాధ్యం చేసి చూపించారు. రైతుల‌తో క‌లిసి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్ కోసం ఉద్య‌మించాలి. ప్ర‌తి గ్రామంలో అవ‌గాహ‌న స‌దస్సులు నిర్వ‌హించాలి

రాయ‌ల‌సీమ రైతుల త్యాగం గొప్పది: గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి
త‌ర‌త‌రాలుగా రాయ‌ల‌సీమ ప్రాంతం తీవ్రంగా న‌ష్టపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన చ‌రిత్ర మ‌న రైతుల‌ది. రాజ‌ధానిని కోల్పోయింది. ఓటుకు కోట్లు కేసులో చంద్ర‌బాబు అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టాడు. సాధ్యం కాద‌ని తెలిసీ వేల కోట్లు అప్పులు తెచ్చి అమ‌రావ‌తి రాజ‌ధాని మీద గుమ్మ‌రిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు. కానీ రాయ‌ల‌సీమ ప్రాంతానికి నీరిచ్చే లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును పూర్తి చేయ‌డానికి  వెయ్యి కోట్లు వెచ్చించ‌డానికి మాత్రం చంద్ర‌బాబుకి మ‌న‌సు రావ‌డం లేదు. మంత్రుల‌ను సింగ‌పూర్ కి పంపి ప‌బ్లిసిటీలు, జ‌ల్సాలు చేయ‌డం త‌ప్ప చిత్త‌శుద్ధితో చంద్రబాబు ఆలోచించ‌డం లేదు.  

చంద్ర‌బాబు సీఎం కావ‌డం రైతుల దౌర్భాగ్యం: బుడ్డా శేషారెడ్డి
చంద్ర‌బాబు అధికారంలో ఉంటే రైతులంతా రోడ్ల మీద ఉండాల్సిన దుస్థితి. ఎరువులు, పురుగు మందులు, గిట్టుబాటు ధ‌ర‌లు ఏది కావాల‌న్నా రోడ్డెక్కి ధ‌ర్నా చేయాల్సిన దుస్థితి. రాయ‌ల‌సీమ‌లో పుట్టి ఈ ప్రాంతానికి చంద్ర‌బాబు చేసింది శూన్యం. రాయ‌ల‌సీమ రైతాంగాన్ని కాపాడుకోవ‌డం కోసం అంద‌రూ ఉద్య‌మించాలి.  

అమ‌రావ‌తికైతే డ‌బ్బులున్నాయా?: త‌లారి రంగ‌య్య‌
రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్రారంభించ‌క‌ పోయుంటే రైతుల ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అమ‌రావ‌తి కోసం ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి మ‌రీ ఖ‌ర్చు చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన చంద్ర‌బాబు, రాష్ట్రంలో స‌గం ప్రాంత‌మైన గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల కోసం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తి చేయ‌డానికి ఖ‌ర్చు చేయ‌డం లేదు. విద్య‌, వైద్యం, సాగునీటి రంగాల విష‌యంలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది.

జ‌గ‌న్‌ ముందుచూపుతో ఆలోచించారు: పాపిరెడ్డి
రాష్ట్ర సాగునీటి రంగాన్ని 2004కి ముందు 2004 త‌ర్వాత అని చూడాలి. దివంగ‌త వైయ‌స్సార్ కృషితో రాయ‌ల‌సీమ ముఖ‌చిత్రం మారిపోయింది. సాగునీటి రంగానికి ఎన‌లేని కృషి చేశారు. చంద్ర‌బాబు మాట‌ల‌న్నీ నీటి మూట‌లుగానే మిగిలిపోయాయి. రాయ‌ల‌సీమ పెండింగ్ ప్రాజెక్టుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మొద‌లు పెట్టి పూర్తి చేసిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. రాయ‌ల‌సీమ భావితరాల కోసం దూర‌దృష్టితో ఆలోచించి ప‌నిచేశారు.

అమ‌రావ‌తిపై ఉన్న శ్ర‌ద్ధ రాయ‌ల‌సీమ మీద‌ లేదు: కాట‌సాని రామిరెడ్డి
రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు ఆవ‌శ్య‌క‌త‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్య‌త వైయ‌స్సార్సీపీ నాయ‌కుల మీద‌నే ఉంది. భావిత‌రాల భ‌విష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోరాటం చేయాలి. చంద్ర‌బాబు కార‌ణంగా రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారే ప్ర‌మాదం ముంచుకొస్తోంది. అమ‌రావ‌తి మీద ఉన్న శ్ర‌ద్ధ ఆయ‌న‌కు పుట్టిన గ‌డ్డ రాయ‌ల‌సీమ మీద‌ లేదు. రైతు సంఘాల‌తో క‌లిసి రాయ‌ల‌సీమ ప్రాజెక్టును పునః ప్రారంభించేలా ఉద్య‌మించాలి.

చంద్ర‌బాబు మోసాల‌పై గ్రామ గ్రామాన చ‌ర్చ జ‌ర‌గాలి: గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి
సాగునీటి రంగాన్ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింది. రాయ‌ల‌సీమ ప్రాంతానికి జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళ‌మెత్తాలి. 90 శాతం పూర్త‌యిన రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును ప‌క్క‌న‌పెట్టేయ‌డం దుర్మార్గం. యావ‌త్తు రాయ‌ల‌సీమ ప్రాంతానికే అన్యాయం జ‌రిగే ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాయ‌ల‌సీమ ప్రాంతానికి చంద్ర‌బాబు చేస్తున్న అన్యాయంపై గ్రామగ్రామాన చ‌ర్చ‌జ‌ర‌గాలి.

ప్ర‌భుత్వానికి బుద్ది చెప్పే స‌మ‌యం ఆస‌న్న‌మైంది: ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తా రెడ్డి
లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును ఆపేసి ప్ర‌జ‌ల మ‌నుగ‌డను చంద్ర‌బాబు ప్ర‌శ్నార్థ‌కం చేశాడు. త‌న వ్యక్తిగ‌త స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రాయ‌లసీమ రైతాంగం భ‌విష్య‌త్తును ప‌ణంగా పెట్టడం దుర్మార్గం. 90 శాతం పనులు పూర్త‌యిన ప్రాజెక్టు విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి అనుమానాస్ప‌దంగా ఉంది. రాయ‌ల‌సీమ‌కు వెన్నుపోటు పొడిచిన కూట‌మి ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పే స‌మ‌యం ఆస‌న్నమైంది. త‌క్ష‌ణం ప‌నులు మొద‌లుపెట్ట‌క‌పోతే రాయ‌ల‌సీమ కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు మూల్యం చెల్లించుకోక‌ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నా.

Advertisement
 
Advertisement
Advertisement