
విజయవాడ: తమ పార్టీకి చెందిన నేతల పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి విమర్శించారు. గండూరు ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో విచారణకు గౌతమ్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు పిలిచారు పోలీసులు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ ఎదుట విచారణకు హాజరయ్యారు గౌతమ్ రెడ్డి. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ సీపీ నేతల పట్ల పోలీసులు కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను విజయవాడ పోలీసులు తుంగలో తొక్కుతున్నారు.పోలీసులు పిలిచినప్పుడు విచారణకు సహకరించాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ పోలీసులు విచారణతో సంబంధం లేకుండా ప్రతి సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధం. ప్రాథమిక హక్కులు హరించేలా పోలీసుల వైఖరి ఉంది కక్ష సాధింపు చర్యలో భాగంగా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీనిపై ప్రజాస్వామ్య వాదులంతా స్పందిస్తారని అనుకుంటున్నా. పోలీసుల వైఖరి పై, నోటీసు జారీ చేసిన తీరుపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా’ అని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.