హత్యా రాజకీయాలకు బాబే బ్రాండ్‌ అంబాసిడర్‌ | YSRCP Kadapa District President Ravindranatha Reddy fires on tdp | Sakshi
Sakshi News home page

హత్యా రాజకీయాలకు బాబే బ్రాండ్‌ అంబాసిడర్‌

Apr 22 2026 3:40 AM | Updated on Apr 22 2026 3:40 AM

YSRCP Kadapa District President Ravindranatha Reddy fires on tdp

కడపలో దస్తగిరి హత్య వ్యక్తిగత సమస్య  

రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా వైఎస్‌ జగన్‌పై రుద్దే ప్రయత్నం   

వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ధ్వజం 

పులివెందుల : హత్యా రాజకీయాలకు సీఎం చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, ఆయన చరిత్రే ఇందుకు సాక్ష్యమని వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. పులివెందులలోని భాకరాపురంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గత 23 నెలల కాలంలో 21 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. టీడీపీ వాళ్లు హత్యలు చేసి వేరే వాళ్లపై రుద్దడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గతంలో జరిగిన రిటైర్డు ఆఫీసర్‌ రాఘవేంద్రరావు హత్య, వంగవీటి మోహన రంగ హత్య, పింగళి దశరథరాం హత్య ఎవరు చేశారనేది జగమెరిగిన సత్యమని, దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. 

గోబెల్స్‌ ప్రచారం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై రుద్దడం, మా పార్టీ నాయకులను బద్నాం చేయడం బాబుకు పరిపాటిగా మారిందన్నారు. 15 రోజుల క్రితం జరిగిన దస్తగిరి హత్య వ్యక్తిగతమన్నారు. దస్తగిరి వైఎస్సార్‌సీపీ ఫాలోవర్‌ అని, అందరితో కలివిడిగా ఉండేవాడని చెప్పారు. మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డికి, ఈ పెద్ద దస్తగిరికి ఎప్పుడూ వైషమ్యాలు లేవన్నారు. ఆయన పేరు ఎందుకు తీసుకొచ్చారో తెలియడం లేదన్నారు.

దొరికిన వారు నిత్యానందరెడ్డి దగ్గర ఉంటారని కేసులో ఇరికించడం సరికాదని తెలిపారు. పెద్ద దస్తగిరి రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ను అందరితో చేస్తారని.. అలా అని హత్య కేసును వైఎస్సార్‌సీపీ నేతలకు అంటించడం చాలా దారుణమన్నారు. ఎవరైతే పెద్ద దస్తగిరిని హత్య చేశారో కచ్చితంగా వాళ్లకు శిక్ష పడాలని తామంతా కోరుకుంటున్నామన్నారు. తాను, అంజాద్‌ బాషా ఎస్పీని కలిసి అదే విన్నవించామని వెల్లడించారు. 

వైఎస్‌ జగన్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ హత్యా రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ఎవరైతే హత్య చేశారో వారిని తప్పకుండా శిక్షించాలని... అలా కాకుండా సంబంధం లేని వారిని కేసులో ఇరికిస్తే భవిష్యత్‌లో అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌ బాషా, పులివెందుల మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ చిన్నప్ప, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement