సాక్షి, తాడేపల్లి: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ మరో పిటిషన్ వేసింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న కేసు వివరాలు దరఖాస్తు చేసిన 24 గంటల్లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. అభ్యర్థులపై ఎక్కడ ఏఏ కేసులు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పిటిషన్ రేపు(శుక్రవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై నమోదైన, పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించేలా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని కూడా వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు లేళ్ల అప్పిరెడ్డి.. ఎస్ఈసీకి లేఖ రాశారు. కూటమి సర్కారు పోలీసుల సాయంతో వైఎస్సార్సీపీ ఆశావహ అభ్యర్ధులపై చేస్తున్న వేధింపుల్ని ఈ లేఖలో ప్రస్తావించారు.
వాటిని అడ్డుకోవడంతో పాటు తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులకు అవసరమైన వివరాలు అందించేందుకు రాష్ట్ర డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా లేఖలో కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా, వివిధ పోలీస్ స్టేషన్లలో తమ పార్టీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తద్వారా వారిలో భయాందోళనలు సృష్టించి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆటంకం కలిగిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?


