పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా? | Sakshi
Sakshi News home page

పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?

Published Fri, May 24 2024 6:27 AM

YSRCP complaint to Election Commission against SP

ఎస్పీపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు 

ఫుటేజీని పరిశీలిస్తే రిగ్గింగ్‌ నిజమేనని రుజువవుతుంది 

స్పందించకుంటే న్యాయ పోరాటమే

సాక్షి, అమరావతి: ఎన్నికల రోజు ఉదయం నుంచి సాయంత్రం 7గంటల వరకు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్‌పై మాచర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలు ఫిర్యాదు చేసినా జిల్లా ఎస్పీ బేఖాతర్‌ చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను గురువారం కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచకాలు, హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకుంటే హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్‌ రోజు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయన్నారు.

ఈ అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిందని, 60కి పైగా కేంద్రాలలో రీపోలింగ్‌ నిర్వహించాలని కోరామన్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన వారిపై టీడీపీ మూకలు దాడులకు తెగబడటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదన్నారు. ఎన్నికల ముందు పోలీస్‌ అధికారులను ఈసీ ఆకస్మికంగా బదిలీ చేయడంతో హింస చెలరేగిందని చెప్పారు. దీనికి బీజేపీ, టీడీపీ, ఈసీ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.   

బదిలీలతో చెలరేగిన హింస.. 
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గురించి ముందుగానే ఈసీ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా తగిన భద్రత కలి్పంచాలని కోరామన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో టీడీపీ బరి తెగించి రిగ్గింగ్, దాడులకు తెగబడిందన్నారు. చంద్రబాబు,  పురందేశ్వరి ఒత్తిడితో ఈసీ అధికారులను బదిలీ చేసిన చోట్ల హింస చెలరేగిందన్నారు.  రిగ్గింగ్, ఓటర్లను బెదిరించడం, బూత్‌ల క్యాప్చరింగ్‌ తదితరాలపై పోలింగ్‌ రోజే టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు శాసన మండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.

16 నియోజకవర్గాలకు సంబంధించి 60 పోలింగ్‌ బూత్‌లలో రీ పోలింగ్‌ జరపాలని కోరామన్నారు. రీ పోలింగ్‌ కోరుతున్న బూత్‌లలో లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. పాల్వాయి గేట్, తుమృకోట, చింతపల్లి, ఒప్పిచర్ల, జెట్టిపాలెం, వెల్దుర్తిలో టీడీపీ విధ్వంసకాండపై ఈసీకి పోలింగ్‌ రోజే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పారు. వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇతర అసాంఘిక శక్తులపై  చర్యలు తీసుకోవాలన్నారు.  వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నేత శ్రీనివాసరెడ్డి, పానుగంటి చైతన్య పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement