
శ్రీసత్యసాయి జిల్లా కల్లి తండాలో వైఎస్ జగన్
వీర జవాన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధినేత పరామర్శ
మురళీ నాయక్ దేశం గర్వపడేలా విధులు నిర్వర్తించారు
యావత్ దేశం రుణపడి ఉంటుంది
వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షల సాయం
రూ.50 లక్షలు ప్రభుత్వ పరిహారం అభినందనీయం
ఈ సంప్రదాయాన్ని తెచ్చింది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
సాక్షి, పుట్టపర్తి: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ వయసులో చిన్నవాడే అయినప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. యావత్ భారత్ గర్వపడేలా వీరోచితంగా పోరాడి.. దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన వీరుడన్నారు.
మంగళవారం మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు.
‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
మురళీ కుటుంబానికి రూ.25 లక్షల సాయం
కల్లి తండాలో వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్ త్యాగానికి వెల కట్టలేమని చెప్పారు. దేశం కోసం పోరాడుతూ.. తన ప్రాణ త్యాగంతో మిగిలిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు రక్షణ ఇచ్చారన్నారు. యావత్ భారత్ దృష్టిని ఆకర్షించిన మురళీని మన మధ్యలోకి తేలేం కానీ.. ఆయన త్యాగానికి రుణపడి ఉంటామన్నారు.

దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. దేశం కోసం పోరాడుతూ.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసే సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడం పట్ల అభినందించారు.
దారి పొడవునా స్వాగతం
కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి కొడికొండ చెక్‌పోస్టు, కోడూరు, పాల సముద్రం, గుమ్మయ్యగారిపల్లి, కల్లి తండా వరకు దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ సరిహద్దులో వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. జాతీయ జెండాలతో చిన్నారులు మార్గం మధ్యలో స్వాగతం పలికారు. వాహనంపై నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.