Andhra Pradesh: కొనసాగుతున్న కొత్త విప్లవం

Ysrcp Announced Mlc Candidates Names In Andhra Pradesh - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో సగం మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలే

తాజాగా 11 స్థానిక సంస్థల కోటా అభ్యర్థులను ప్రకటించిన పార్టీ

ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే పేర్ల ఖరారు 

అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో బలాబలాలను బట్టి 14 చోట్లా గెలుపు ఖాయం 

సీఎం జగన్‌ సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధితో చాటుకున్నారని ప్రశంసలు 

ఎన్నికలు పూర్తయ్యాక మండలిలో 32కి పెరగనున్న వైఎస్సార్‌సీపీ బలం 

వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 18 మంది  

మండలిలో ఒక పార్టీ నుంచి నలుగురు మైనార్టీలే కావడం ఇదే తొలిసారి 

సార్వత్రిక ఎన్నికలతో ప్రారంభించి రాజకీయ, సామాజిక విప్లవానికి నాంది  

అప్పటి నుంచి అదే ఒరవడిని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి:  2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం కల్పించి సరికొత్త సామాజిక రాజకీయ విప్లవానికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్న 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయానికే ముఖ్యమంత్రి జగన్‌ పెద్దపీట వేస్తూ వస్తున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల కోటా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలను శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఏడుగురికి వైఎస్సార్‌సీపీ అవకాశం కల్పించడం గమనార్హం. మిగతా ఏడు చోట్ల ఓసీ (క్షత్రియ–1, కాపు–2, కమ్మ–2, రెడ్డి–2) అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ 50 శాతం స్థానాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సామాజిక న్యాయంపై తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.  
 
ఇంత ప్రాధాన్యం ఇదే తొలిసారి.. 
ప్రస్తుతం శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ తరఫున 18 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా అందులో 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. శాసనసభ, స్థానిక సంస్థల్లో పార్టీలకు ఉన్న బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 14 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగరవడం ఖాయమని స్పష్టమవుతోంది. అప్పుడు మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య 18 నుంచి 32కు పెరుగుతుంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు  చెందిన ఎమ్మెల్సీల సంఖ్య 11 నుంచి 18కి పెరగనుంది. మండలిలో ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే సభ్యుల్లో 56.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే కానుండటం ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. ఇక రాష్ట్రంలో మైనార్టీ వర్గాల నుంచి ఒక పార్టీ తరఫున నలుగురు సభ్యులు మండలికి ప్రాతినిధ్యం వహించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతితోపాటు మహిళా సాధికారతకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలనలోనూ ఆ వర్గాల వారికే సింహభాగం అవకాశం కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని చాటిచెబుతున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు.  
 
చిత్తశుద్ధితో సింహభాగం... 
పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు సింహభాగం అవకాశం కల్పించడం ద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదం చేస్తుందని, ఇది పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ పలు సందర్భాల్లో తన అభిమతాన్ని చాటిచెప్పారు. పరిపాలనలో భాగస్వా్మ్యం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఈ కోవలో 2019 ఎన్నికల్లో అధిక శాతం శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు టికెట్లు ఇచ్చి సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత మంత్రివర్గంలోనూ 60 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు నలుగురు ఉన్నారు. 
 
 నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు  
– నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకే అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తెచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 137 నామినేటెడ్‌ పదవుల్లో దాదాపు 58 శాతం అంటే 79 పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారికే ఇచ్చారు. 
– రాష్ట్రంలో 47 కార్పొరేషన్లలో 481 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఇందులో సుమారు 52 శాతం పదవులు అంటే 248 డైరెక్టర్ల పదవుల్లో మహిళలను నియమించింది. మిగిలిన 48 శాతం అంటే 233 డైరెక్టర్ల పదవుల్లో పురుషులకు అవకాశం కల్పించారు. డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే దక్కాయి.  
 
 స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కంటే అధికంగా.. 

  • మున్సిపల్‌ చైర్‌ పర్సన్, మేయర్‌ పదవుల్లో 78 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. అందులో 60.46 శాతం పదవులను మహిళలకే ఇచ్చి రికార్డు సృష్టించారు. 
  •  జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయాన్ని  పాటించారు. 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా తొమ్మిది కేటాయించారు. విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్‌ పదవులు జనరల్‌ విభాగానికి రిజర్వు అయినా ఆ రెండింటిలో బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ (మహిళ)కు ప్రభుత్వం రిజర్వు చేసినా ఆ పదవిని బీసీ మహిళ ఉప్పాల హారికకు కేటాయించారు. 
  • ఒక్కో జిల్లా పరిషత్‌కు ఇద్దరేసి ఉపాధ్యక్షుల చొప్పున 26 ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 20 పదవులను కేటాయించారు. మిగిలిన ఆరు చోట్ల ఓసీలకు అవకాశం కల్పించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లుగా ఏడుగురికి,  వైస్‌ చైర్‌పర్సన్లుగా 15 మంది మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. 
  • రాష్ట్రంలో 620 ఎంపీపీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 67 శాతం, ఓసీలకు 33 శాతం పదవులను కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో ఏకంగా 64 శాతం (397) పదవులను మహిళలకు కేటాయించగా 36 శాతం (223) పదవులను పురుషులకు కేటాయించారు. 

 
సీఎం నాయకత్వ పటిమకు నిదర్శనం
– సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపారు: సజ్జల 
ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ సీనియర్‌ నేతలతో చర్చించి సామాజిక న్యాయాన్ని చాటి చెబుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజ్యాంగపరంగా నిబంధనలు లేనప్పటికీ చట్టసభల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయిస్తూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల కోటాలో మూడు స్థానాలకు అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్‌ (శ్రీకాకుళం జిల్లా, బీసీ–తూర్పు కాపు), ఇషాక్‌ బాష(కర్నూలు జిల్లా, మైనార్టీ), డీసీ గోవిందరెడ్డి (వైఎస్సార్‌ కడప జిల్లా) పేర్లను రెండు రోజుల క్రితమే ప్రకటించిన అంశాన్ని గుర్తు చేశారు.  

నిరాశ చెందవద్దు.. 
సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నందున కొందరు సీనియర్‌ నాయకులు మరికొంత కాలం వేచి ఉండాలని, అవకాశం రాని వారు నిరాశ చెందవద్దని సజ్జల సూచించారు. దీన్ని వైఎస్సార్‌సీపీ నేతలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్‌ నాయకత్వ పటిమ వల్లే అందరినీ సమన్వయపరుస్తూ సామాజిక న్యాయాన్ని కచ్చితంగా అమలు చేయగలుగుతున్నారని తెలిపారు. మంగళగిరిలో చేనేత వర్గాలకు చెందిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. శాసనసభ, స్థానిక సంస్థల్లో ఉన్న బలాన్ని పరిశీలిస్తే ఎన్నికలు జరిగే 14 ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.   


పేరు: డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
స్వగ్రామం: కొండుభట్లవారిపాలెం, గుంటూరు జిల్లా
పుట్టినతేదీ: 1–7–1935 ; చదువు: పీహెచ్‌డీ 
రాజకీయ నేపథ్యం: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయశాస్త్ర విద్యను పూర్తిచేసిన ఆయన బెనారస్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో 26 సంవత్సరాలపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. తెలుగుదేశం తరఫున 1985లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెనాలి, బాపట్ల నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలి చీఫ్‌విప్‌గా, ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు.


పేరు: వరుదు కళ్యాణి
స్వస్థలం: రామజోగిపాలెం, చోడవరం మండలం, విశాఖ జిల్లా 
పుట్టినతేది: 30–08–1979 ; చదువు: బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ
భర్త: గేదెల లక్ష్మణ్‌సురేశ్‌ ; పిల్లలు: సిద్ధార్థ, గౌతమ్‌
రాజకీయ నేపథ్యం: 2012 నుంచి 2014 వరకు వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా పనిచేశారు. పలు ఎన్నికల్లో ఇన్‌చార్జిగా పనిచేశారు. 2014 నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ మహిళా విభాగం ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 


పేరు: ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి
స్వగ్రామం: కొనకొండ్ల, వజ్రకరూరు మండలం, అనంతపురం జిల్లా
చదువు: బీఏ, ఎల్‌ఎల్‌బీ ; భార్య: వై.ఉమాదేవి
పిల్లలు: వై.భీమిరెడ్డి, వై.కీర్తిలక్ష్మి
రాజకీయ ప్రస్థానం: 1999 నుంచి 2004 వరకు ఉరవకొండ ఎమ్మెల్యేగా, 2007 నుంచి ఆరేళ్ల పాటు శాసనమండలి సభ్యుడిగా  పనిచేశారు. శాసనమండలి విప్‌గానూ వ్యవహరించారు.


పేరు: తూమాటి మాధవరావు
స్వగ్రామం: పోలినేనిపాలెం గ్రామం, వలేటివారిపాలెం మండలం, ప్రకాశం జిల్లా ; పుట్టిన తేదీ: 28–6–1977 ; చదువు: ఎంఏ 
తల్లిదండ్రులు: వరలక్ష్మి, మాల్యాద్రి (లేట్‌) 
భార్య: తూమాటి వెంకటశిరీష
కుమారులు: తూమాటి లక్ష్మీదీపక్, పూజిత్‌చౌదరి 
రాజకీయ నేపథ్యం: హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ఆయన ఫార్మా పరిశ్రమ యజమానిగా ఉన్నారు. గతంలో రెండుసార్లు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.


పేరు: కృష్ణరాఘవ జయేంద్రభరత్‌
పుట్టిన తేదీ: నవంబరు 13, 1988 ; భార్య: దుర్గాపద్మిని 
కుమార్తె: ఆరా ; తల్లిదండ్రులు: పద్మజ, చంద్రమౌళి 
విద్యాభ్యాసం: బీటెక్‌
రాజకీయ అనుభవం: 2019 నుంచి వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు 


పేరు: అనంతసత్య ఉదయభాస్కర్‌ (అనంతబాబు)
స్వగ్రామం: ఎల్లవరం, అడ్డతీగల మండలం, తూర్పుగోదావరి జిల్లా
పుట్టిన తేదీ: 19–5–1974 ; చదువు: ఎల్‌ఎల్‌బీ
తల్లిదండ్రులు: మంగారత్నం, చక్రరావు; భార్య: లక్ష్మీదుర్గ
పిల్లలు: మోనిక, హర్షిత
పదవులు: అనంత సత్య ఉదయభాస్కర్‌ అడ్డతీగల జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన తండ్రి చక్రరావు ఎంపీపీగా పనిచేశారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. తాత అనంత వీర్రాజు అడ్డతీగల సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు.


పేరు: డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌ 
స్వగ్రామం: చందర్లపాడు, చందర్లపాడు మండలం, కృష్ణాజిల్లా
పుట్టినతేదీ: 04.09.1975 ; చదువు: పీహెచ్‌డీ
తండ్రి: మొండితోక కృష్ణ ; భార్య: శశికళ
పిల్లలు: శరణ్‌సిద్ధార్థ్, శ్రేయాన్‌
రాజకీయ అనుభవం: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 


పేరు: చెన్నుబోయిన వంశీకృష్ణశ్రీనివాస్‌
పుట్టినతేదీ: 5–2–1974 ; చదువు: ఎంఏ
భార్య: పద్మజ ;పిల్లలు: సాయిసందీప్, లహరిప్రవల్లిక
రాజకీయ నేపథ్యం: 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక స్థానాల్లో కొనసాగారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.


పేరు: ఇందుకూరి రఘురాజు

స్వగ్రామం: బొడ్డవర, ఎస్‌.కోట మండలం, విజయనగరం జిల్లా 
పుట్టినతేదీ: 18–07–1973; చదువు: బీఏ; తల్లిదండ్రులు: రాణి, రామరాజు
భార్య: సుధారాజు (మండల ఉపాధ్యక్షురాలు)
పిల్లలు: రామరాజు, పూజిత 
రాజకీయ నేపథ్యం:సాధారణ రైతు కుటుంబం. ఎంపీపీగా పనిచేసిన పెదతండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడిగా, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. జిల్లా ప్లానింగ్‌ కమిటీ సభ్యుడిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 


పేరు: తలశిల రఘురాం

స్వగ్రామం: గొల్లపూడి, కృష్ణాజిల్లా ; పుట్టినతేదీ: 20–6–1966
చదువు: బీకాం ; తల్లిదండ్రులు: బేబీసరోజ, చంద్రశేఖరరావు
భార్య: స్వర్ణకుమారి ; కుమార్తె: ప్రణవి 
రాజకీయ నేపథ్యం: విద్యార్థి నాయకుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1996 నుంచి 2002 వరకు కృష్ణాజిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాల సమన్వయకర్తగా ఉన్నారు. 


పేరు: మురుగుడు హనుమంతరావు    
స్వగ్రామం: మంగళగిరి, గుంటూరు జిల్లా
పుట్టినతేదీ: 15–3–1947 ; తల్లిదండ్రులు: మాణిక్యం, చినవీరరాఘవులు
భార్య: సామ్రాజ్యం ; పిల్లలు: అరుణకుమారి, మధుసూదనరావు, సత్యం
రాజకీయ నేపథ్యం: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన హనుమంతరావు 1987లో మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆప్కో చైర్మన్‌గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top