నేడే ‘పోషణ’కు శ్రీకారం

YSR Sampoorna Poshana And Sampporna Poshana Plus Schemes Start From 7th - Sakshi

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలు ప్రారంభం

అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధక ఆహారం

క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌

రెండు పథకాలతో ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య 30.16 లక్షలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాలను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్‌ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్‌ బాల సంజీవనికి అదనంగా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయనున్నారు.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం..
4 రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్‌ హోమ్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు.

– 36 నుంచి 72 నెలల లోపున్న 1.64 లక్షల మంది చిన్నారులకు నెలలో 25 రోజులపాటు వేడి అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు 200 మిల్లీ లీటర్ల పాలు, కోడిగుడ్డు, 50 గ్రాముల బాలామృతం లడ్డు ఇస్తారు. ఒక్కొక్కరికి రూ.553 చొప్పున మొత్తం రూ.108.83 కోట్లు ఖర్చు కానుంది.
 – 6 నుంచి 36 నెలలలోపున్న 1.50 లక్షల మంది చిన్నారులకు టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2.5 కిలోల బాలామృతం, 30 కోడి గుడ్లు, 6 లీటర్ల పాలు అందించనున్నారు. ఒక్కొక్కరిపై నెలకు రూ.620 చొప్పున మొత్తం రూ.111.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం 3.80 లక్షల మంది లబ్ధిదారులపై రూ.307.55 కోట్లు ఖర్చు చేయనున్నారు.
 
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం..
– ఈ పథకాన్ని 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. 5.80 లక్షలమంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ  చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.  
 – 36 నుంచి 72 నెలల్లోపు ఉన్న 7.06 లక్షల మంది చిన్నారులకు నెలకు ఒక్కొక్కరిపై రూ.350 చొప్పున మొత్తం రూ.296.52 కోట్లు ఈ పథకంతో ఖర్చు చేస్తారు. 
– 6 నుంచి 36 నెలల లోపున్న 13.50 లక్షల మంది చిన్నారులకు ఒక్కొక్కరిపై రూ.412 చొప్పున మొత్తం రూ.667.44 కోట్లు ఖర్చు చేయనున్నారు. 
– వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో మొత్తం 26.36 లక్షలమంది లబ్ధిదారులకోసం ప్రభుత్వం రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రెండు పథకాల అమలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top