అస్తవ్యస్త విధానాలు, అవినీతి.. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం | YS Jagan Mohan Reddy fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్త విధానాలు, అవినీతి.. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం

May 17 2026 4:52 AM | Updated on May 17 2026 5:09 AM

YS Jagan Mohan Reddy fires on chandrababu naidu

సంపద సృష్టి అంటే ఇదేనా బాబూ? 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు

కలవరపెడుతున్న 2025–26 కాగ్‌ ప్రొవిజనల్‌ గణాంకాలు  

పన్ను రాబడులు తగ్గిపోతే జీఎస్‌డీపీ వృద్ధి అంటూ అబద్ధాలు 

సొంత పన్నుల రాబడిలో 3.22 శాతం క్షీణత ఉంటే 10.75 శాతం వృద్ధి ఎలా సాధ్యం? 

పన్ను రాబడి 9.60 శాతం పెరిగితేనే జీఎస్‌డీపీ వృద్ధి ఆ మేర సాధ్యం   

ఏపీఎండీసీ ద్వారా రూ.9,000 కోట్ల అప్పు.. ఫలితంగా ఆస్తులు లేవు.. సంపద సృష్టీ లేదు 

కేవలం రెవెన్యూ వ్యయానికి మాత్రమే ఆ అప్పులు వినియోగించారు 

ప్రైవేట్‌ మద్యం దుకాణాలు, బెల్ట్‌ షాపులు, అక్రమ పర్మిట్‌ రూములు.. అయినా ఎక్సైజ్‌ రాబడుల్లో క్షీణతేనా? 

వేగంగా వృద్ధి అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకే కట్టు కథలు 

రెండేళ్లుగా వేగంగా అప్పులు చేయడం తప్ప మరొకటి లేదు

సాక్షి, అమరావతి: రెండేళ్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అస్తవ్యస్త విధానాలు, అవినీతితో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పినట్లు సంపద సృష్టించక పోగా, రాష్ట్రాన్ని వేగంగా అప్పుల్లోకి తీసుకుపోయి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025–26 ఆర్థిక ఏడాదికి సంబంధించి కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ప్రొవిజినల్‌ గణాంకాలను పరిశీలిస్తే కలవరపరిచే వాస్తవాలు వెల్లడయ్యాయని చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కట్టు కథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సీఎం చంద్రబాబు విధానాలపై శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి.

 ప్రజల దృష్టిని మళ్లించేందుకు అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ, సంపద సృష్టిస్తున్నామంటూ చంద్రబాబు అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడి తగ్గిపోతే జీఎస్‌డీపీ ఏకంగా 10.75 శాతం వృద్ధి సాధించినట్లు చంద్రబాబు చెప్పడం కట్టు కథ తప్ప మరొకటి కాదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో  రాష్ట్ర సొంత పన్ను రాబడి 3.22 శాతం తగ్గిపోతే జీఎస్‌డీపీ వృద్ధి ఎలా సాధ్యమవుతుంది?

ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అక్కడ పెట్టుబడులు, వినియోగం పెరుగుతాయి. తద్వారా రాష్ట్ర పన్ను రాబడి పెరుగుతుంది. కానీ, రాష్ట్రంలో పన్ను రాబడి 3.22 శాతం తగ్గిందంటే దీని అర్థం ఏమిటి? రాష్ట్ర పన్ను రాబడులు 9.60 శాతం పెరిగి ఉంటే జీఎస్‌డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందంటే నమ్ముతారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా సొంత పన్ను రాబడి 3.22 శాతం క్షీణత నెలకొంది.

  2023–24లో (గత ప్రభుత్వ చివరి సంవత్సరం) రాష్ట్ర పన్ను రాబడులు రూ.85,922.23 కోట్లు ఉన్నాయి. రెండేళ్ల తర్వాత 8 శాతం సాధారణ వృద్ధిని సాధించినా కూడా, 2025–26 సంవత్సరంలో పన్ను రాబడులు రూ.1,00,219.69 కోట్లు ఉండాలి. అయితే, 2025–26లో కేవలం రూ.86,552.68 కోట్లు మాత్రమే సమకూరాయి. దీంతో ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.13,667 కోట్లు నష్టం ఉంది. చంద్రబాబు సంపద సృష్టి గురించి పదే పదే మాట్లాడుతారు.. ఇదేనా ఆయన సంపద సృష్టి?

గత ఏడాది ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీతో రూ.9,000 కోట్లు అప్పు చేసినప్పటికీ ఎటువంటి ఆస్తి, సంపద సృష్టించలేదు. ఆ మొత్తాన్ని రెవెన్యూ వ్యయానికి వినియోగించారు. గత ఏడాది ఆదాయం తగ్గితే ఈ ఏడాదైనా ఆదాయం పెరిగేలా చూసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అçస్తవ్యస్త విధానాలు, అవినీతి చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాబడులు తగ్గడం అంటే టీడీపీ ప్రభుత్వ దూరదృష్టి లేని విధానాలు, అవినీతి పద్ధతులే కారణం.

ఎక్సైజ్‌ రాబడుల విషయానికి వస్తే, టీడీపీ ప్రభుత్వం మద్యం రిటైల్‌ కార్యకలాపాలను ప్రైవేటీకరించింది. దుకాణాల సంఖ్యను పెంచింది. అక్రమ బెల్ట్‌ షాపులను ప్రోత్సహించింది. అక్రమ పర్మిట్‌ రూములను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ విధాన మార్పులన్నీ మద్యం వినియోగంలో భారీ పెరుగుదలకు, తద్వారా ఎక్సైజ్‌ రాబడులకు దారితీయాలి. అయితే, ఎలాంటి పెరుగుదల లేకపోగా 8.20 శాతం క్షీణత నమోదైంది.

2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లైసెన్స్‌ ఫీజు ప్రభావాన్ని మినహాయించినప్పటికీ, వృద్ధి కేవలం 0.93 శాతం మాత్రమే. ఇది రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. గత రెండేళ్ల కాలంలో అమ్మకపు పన్ను వసూళ్లు ఎటువంటి వృద్ధిని కనబరచకపోగా, వాస్తవానికి తగ్గాయి. ఇది ఆందోళనకరమైన ధోరణిని సూచిస్తోంది. మొత్తంగా రాష్ట్ర సొంత పన్ను రాబడుల్లో 3.22 శాతం క్షీణత నెలకొంది. సంపద సృష్టి అంటే ఇదేనా బాబూ?

 ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఆదాయ వనరులు, సంపద సృష్టి తనకే సాధ్యమని, ఇందులో తాను నిష్ణాతుడనని పదే పదే చెప్పుకున్నారు. అంతేకాదు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేసిందంటూ నిందించారు. తాను అధికారంలోకి వస్తే పథకాలు అమలు చేయడానికి అప్పులపై ఆధార పడనని, సంపద సృష్టించి అమలు చేస్తానని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రోజు వారీ ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పులపై విపరీతంగా ఆధారపడుతున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అనేక పథకాలను నిలిపి వేయడంతో పాటు చంద్రబాబు తాను ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను అటకెక్కించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుల కోసం అప్పులపై విపరీతంగా ఆధార పడుతోంది. గత రెండేళ్లుగా అవినీతితో ప్రభుత్వ ఖజానా దోపిడీకి పాల్పడటం తప్ప మరొకటి కనిపించడం లేదు. వేగంగా వృద్ధి అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకే కట్టు కథలు చెప్పారు’ అని వైఎస్‌ జగన్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement