కష్టాలు చెప్పుకున్న ప్రజలకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
పులివెందుల క్యాంపు కార్యాలయంలో ఏకధాటిగా ప్రజలతో మమేకం
మాజీ సీఎంను కలిసేందుకు కిక్కిరిసిన జన సందోహం
జై జగన్ నినాదాలతో మారుమోగిన క్యాంపు కార్యాలయం
ఇప్పట్లలో వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
రోడ్డు బాగోలేదని పోస్టు పెట్టినందుకు రిమాండ్‌కు పంపించారని మర్రిపాడు యువకుల ఆవేదన
అక్రమ కేసులకు జడవొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమేనని భరోసా
సాక్షి ప్రతినిధి,కడప: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, చీకటి కొన్నాళ్లేనని.. రాబోయే రోజులు మనవేనని.. మంచి కాలం ముందుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులు, చంద్రబాబు కూటమి ప్రభుత్వ బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రజలతో రోజంతా మమేకమయ్యారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జనం కోసం క్యాంపు కార్యాలయంలోనే ఉండిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన వారి బాధలు వింటూ.. నేనున్నాను.. మీకేం కాదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వారి ఆగడాలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను పేరు పేరున పలకరించారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో మాట్లాడి పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రెండో రోజు బుధవారం వైఎస్ జగన్ పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతిని కాంక్షిస్తూ ఉదయం ఇప్పట్ల గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఇటీవల మరణించిన వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ బలోపేతానికి, ప్రజలకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలు, కృషి ఎల్లప్పుడూ స్మరణీయమన్నారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
కొన్ని నెలల క్రితం మృతి చెందిన పుల్లారెడ్డి ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. పుల్లారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అమృతరెడ్డి దంపతులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పార్నపల్లి రహదారిపై వైఎస్ జగన్‌ను రాజారెడ్డి కాలనీ వాసులు కలిశారు. జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని, పరిహారం విషయంలో తమను ప్రభుత్వం సంప్రదించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడుదామని చెప్పారు. న్యాయం జరగకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా న్యాయం చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.
దారి పొడవునా జనమే జనం
వైఎస్ జగన్ ఇప్పట్ల పర్యటన సందర్భంగా గ్రామస్తులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు దారిపొడవునా అనేక గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి తరలి వచ్చారు. ఇప్పట్ల గ్రామంలో వైఎస్ జగన్‌ను చూడగానే అవ్వాతాతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్ జగన్ గడ్డం నిమురుతూ అభిమానాన్ని చాటుకున్నారు. భయపడొద్దు అవ్వా.. మనకు మళ్లీ మంచి రోజులొస్తాయి.. ధైర్యంగా ఉండండంటూ వారికి భరోసా కలి్పంచారు. అభిమాన నేతను చూసేందుకు గ్రామంలోని మహిళలంతా తరలి వచ్చారు. దారి వెంబడి చేతులు ఊపుతూ అభిమానం చాటుకున్నారు. తిరుగు ప్రయాణంలో సైతం గుంపులు గుంపులుగా రోడ్డుపైకి చేరి వైఎస్ జగన్‌ను కలుసుకునేందుకు వేచి ఉన్నారు. వైఎస్ జగన్ వారందరికీ అభివాదం చేస్తూ.. వారి కష్టాలు విని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.
వైఎస్ జగన్‌ను కలిసిన పిన్నెల్లి బ్రదర్స్
ఇటీవల అక్రమ కేసులో బెయిల్‌పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు బుధవారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. అక్రమ కేసులతో నియంత్రించాలనుకోవడం అవివేకమని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, మంచి రోజులు వస్తాయన్నారు. అన్యాయంగా ప్రవర్తించి, ఏకపక్ష చర్యలు చేపట్టిన వారెవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రోడ్డు నాణ్యతపై సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేస్తే కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారని మర్రిపాడు మండలానికి చెందిన యువకులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అక్రమ కేసులకు జడవాల్సిన పనిలేదని, వచ్చేది మన ప్రభుత్వమేనని జగన్ ధైర్యం చెప్పారు.
కార్యాలయం వద్ద జన సందోహం
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందుల క్యాంపు కార్యాలయం జనసంద్రంగా మారింది. పార్టీ అభిమానులు, క్యాడర్‌తోపాటు యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడా చూసినా జనమే కనిపించారు. ఒక దశలో జనాన్ని అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టం అనిపించింది. కార్యాలయ ప్రాంగణమంతా జై జగన్ నినాదాలతో హోరెత్తింది. వైఎస్ జగన్ వారందరికీ అభివాదం చేస్తూ.. కరచాలనం చేసుకుంటూ, సెల్ఫీలు ఇస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎస్‌బీ అంజద్‌బాషా, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ మేయర్లు సురేష్‌బాబు, పాకా సురేష్, పార్టీ నేతలు వైఎస్ మనోహర్‌రెడ్డి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


