సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్
అన్ని విధాలా మేం అభివృద్ధి చేసిన విశాఖపట్నం కేజీహెచ్‌ను నిర్వహించలేని దౌర్భాగ్య స్థితి మీది
ఉత్తరాంధ్రలో పేదలకు పెద్ద దిక్కు అయిన ఈ ఆస్పత్రిని గాలికొదిలేశారు
ఏకంగా 12 గంటలపాటు కరెంటు పోయి రోగులకు తీవ్ర ఇబ్బందులు
కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులో రోగులకు సేవలందించాల్సిన దుస్థితి
విలేజ్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్ల తొలగింపు
నాడు–నేడు పనులు నిలిపివేత, జీరో వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్య ఆసరా మాయం
108, 104 పరిస్థితి ఘోరం.. ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగం సర్వనాశనం
మేం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం
ఎందుకు ఇంత నిర్లక్ష్యం.. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతారా?
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు గారూ.. అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్‌లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని మీరు రొటీన్ డైలాగులు చెబుతున్న పరిణామాల మధ్య, ఈ పెద్దాసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి?’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతారా.. అంటూ నిప్పులు చెరిగారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
» విశాఖపట్నం కేజీహెచ్‌లో గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కరెంట్ పోతే రాత్రి 12.30 గంటల వరకు పట్టించుకునే నాథుడు లేడు. దాదాపు 12 గంటలపాటు చిన్న పిల్లలు, గర్భిణులు, రోగులు అష్టకష్టాలు పడ్డారు. ఆపరేషన్లు చేయించుకున్న వారి పరిస్థితి మరింత హృదయ విదారకం. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలు అందించాల్సిన దుస్థితి.
ఇవన్నీ మీ రొటీన్ డైలాగ్‌లు, డ్రామాల మధ్య మీకు కనపడక పోవడం దారుణం. రెండు వేల పడకలున్న ఆస్పత్రిలో 1,700 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. ఇలాంటి ఆస్పత్రి నిర్వహించే తీరు ఇదేనా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేదా? అది కూడా 12 గంటలపాటు స్పందన లేకపోవడమా? ప్రభుత్వ ఆస్పత్రులు అంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి?
» మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్‌లు నిర్వీర్యం, పీహెచ్‌సీలు నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్ల తొలగింపు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, టీచింగ్ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు నిలిపేయడం, సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సర్వనాశనం, ఆరోగ్య ఆసరా మాయం.. 108, 104ల పరిస్థితి ఘోరం.
చివరకు 104, 108 కాంట్రాక్టులను మీ పార్టీ సభ్యుడికి అవినీతి కోసం కట్టబెట్టి, ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆస్పత్రులను కూడా దెబ్బతీస్తున్నారు. మేం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారు.
» మా ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశాం. ప్రస్తుత క్యాజువాలిటీని ఆధునికీకరించడమే కాకుండా, రెండో క్యాజువాలిటీని 24 గంటలూ సేవలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. సీఎస్‌ఆర్ బ్లాక్ పూర్తి చేసి 200 పడకలు అందుబాటులోకి తెచ్చాం. కొత్త అల్ట్రా సౌండ్ స్కాన్, కొత్త ఎమ్మారై, మొబైల్ ఎక్సరే, ఆన్‌లైన్‌లోనే రోగి పరీక్ష ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు, క్రిటికల్ కేర్ యూనిట్‌తోపాటు ఓపీ మొత్తాన్ని ఆధునికీకరించాం.
వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్ నిర్మాణం, ఆధునిక పరికరాలు, భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్లు, అందుబాటులోకి కేన్సర్ కేర్ యూనిట్.. అందులో అత్యాధునిక పరికరాలు, ఒక్క కేజీహెచ్‌కే కొత్తగా 8 అంబులెన్సులు, రోగుల సహాయకుల బస కోసం చౌల్ట్రీల ఆధునికీకరణ, దీంతోపాటు వెయిటింగ్ హాల్స్‌ను కనీసం 200–250 మంది ఉండేలా తీర్చిదిద్దాం.

ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలతో కేజీహెచ్ ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషి చేశాం. కానీ, మీరు వాటన్నింటినీ నీరుగారుస్తూ పేదవాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మేం గొప్పగా ఆధునికీకరించినవి కూడా మీరు మెయింటెయిన్ చేయలేకపోతున్నారు. కార్డియాలజీ విభాగంలో పరికరాలు పాడైపోయి ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు ఏడు నెలలకు పైగా గుండె ఆపరేషన్లు ఆగిపోవడం మీ పాలనా వైఫల్యం కాదా చంద్రబాబు గారూ?
ఇప్పుడు కూడా అరకొరగానే నడిపిస్తున్నారు కదా? ఆస్పత్రిలో కరెంటు లేని కారణంగా ఆక్సిజన్ అందకపోవడంతో దేవీ అనే మహిళ చనిపోయిందని ఆ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎన్ని పాపాలు చేస్తారు చంద్రబాబు గారూ? చివరకు నిన్న పులివెందుల టీచింగ్ ఆస్పత్రి నుంచి పరికరాలు తీసేస్తున్న ఫొటోలు చూస్తుంటే నిజంగా మీ పాపాలకైనా హద్దుండాలి కదా?
.@ncbn గారూ…, అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్‌లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని… pic.twitter.com/u0761DrSW5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2025


