
కొత్తపల్లి: యుద్ధ ట్యాంకర్ ఇలా పల్లెల్లోకి వచ్చిందనుకుంటున్నారా..! అవును నిజమేనండి. కానీ మినీ యుద్ధ ట్యాంకర్. ఓ యువకుడి నైపుణ్యం నుంచి ఇలా రూపుదిద్దుకుంది. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే దృఢసంకల్పం ఇలా ఆర్మీ పరికరాలను తయారు చేసేలా మార్చింది. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు వెంకటరాయపురానికి చెందిన పంపన నాగేంద్ర ఈ మినీ యుద్ధ ట్యాంకర్ రూపశిల్పి. ఇతను ఐటీఐ ఫిట్టర్ చదివాడు. ప్రస్తుతం కాకినాడలోనే డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
దేశానికి రక్షణ కవచంలా ఉన్న ఆర్మీలో చేరడం అంటే ఇతనికి ఎంతో ఇష్టం. వారు ఉపయోగించే పరికరాలంటే ఎంతో మక్కువ. అదే ఈ ట్యాంకర్ తయారీకి ఉపయోగపడింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ మినీ యుద్ధ ట్యాంకర్‌ను తయారు చేసినట్లు నాగేంద్ర చెబుతున్నాడు. దీనికి సుమారు రూ.1.80 లక్షల ఖర్చు అయ్యిందని చెప్పాడు. ట్రాక్టర్, ఆటో, మోటారు సైకిళ్లలోని పలు పరికరాలు, ఇనుప రేకులు, సీలింగ్ తయారు చేసే షీట్లు, విద్యుత్ పరికరాలు ఉపయోగించినట్లు వివరించాడు.
సుమారు 45 రోజులు శ్రమించి ఈ ట్యాంకర్‌ను తయారు చేసినట్లు చెబుతున్నాడు. దీని నుంచి ప్రతి 5 సెకన్లకు ఒక తూటా పేలుతుంది. ఇలా ఆరు తూటాలు వస్తాయి. తూటా సుమారు 600 మీటర్ల వరకూ వెళుతుంది. ఈ తూటాలు పేలేందుకు మందుగుండు సామగ్రిని ఉపయోగించాడు. ఆర్మీలో చేరి పరికరాలు తయారు చేయాలన్నదే తన లక్ష్యమని నాగేంద్ర వివరించాడు. ఇప్పటికే ఆర్మీలో ఉపయోగించే ఏకే 47 గన్‌తో పాటు పలు గన్‌లు, మినీ యుద్ధ ట్యాంకులు, పలు కాలేజీల నమూనాలు తయారు చేశానన్నారు. ఈ మినీ యుద్ధ ట్యాంకును కాకినాడ లైట్ హౌస్ బీచ్ వద్ద ప్రదర్శనకు ఉంచామన్నారు. ఈ యువకుడి నైపుణ్యంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. శభాష్.. నాగేంద్ర అంటూ చుట్టు పక్కల వారు ఆ కుర్రాడిని కొనియాడుతున్నారు.