
రమణయ్యపేట వద్ద ప్రధాన రహదారిపై నాట్లు వేస్తున్న మహిళలు
కాకినాడ జిల్లాలో మహిళల వినూత్న నిరసన
ఏలేశ్వరం: ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ, భారీ గోతులు పడిన ఈ రోడ్డుపై మహిళలు నాట్లు వేసిన ఘటన ఇది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రహదారి శిథిలమై దారుణంగా ఉంది. రమణయ్యపేట గ్రామం నుంచి పది కిలోమీటర్ల మేర ఈ రోడ్డు గోతులమయంగా మారింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు మరింత అధ్వానంగా మారింది.
రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ (ఎంఎల్) వినోద్‌మిశ్రా, సీపీఎం అనుబంధ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యాన మహిళలు ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రహదారిని పునర్నిర్మించేంత వరకూ కదిలేదిలేదని భీషి్మంచారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు, నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు లోత రామారావు, రెడ్డి ఆనంద్‌పాల్, గండేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.