
ఖతార్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్న బాధితురాలు
తిండి పెట్టకుండా, పిల్లలతో మాట్లాడనీయకుండా నరకం చూపించారంటూ ఆవేదన
అంబాజీపేట(తూర్పు గోదావరి): కుటుంబ అవసరాల నిమిత్తం జీవనోపాధికి ఇతర దేశానికి వెళ్లిన ఓ మహిళకు అక్కడి వారు పెట్టిన టార్చర్ తట్టుకోలేక నరకం అనుభవించింది. అక్కడ పడుతున్న ఇబ్బందులను రిస్క్ చేసి తన భర్తకు వీడియో, వాయిస్ మెసేజ్ ద్వారా సమాచారం అందించింది. దాంతో తన భర్త ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సహకారంతో స్వగ్రామానికి క్షేమంగా చేరుకుంది ఆ మహిళ. వివరాల్లోకి వెళితే... అంబాజీపేట మండలం తొండవరం సత్యవతికాలనీకి చెందిన ఉందుర్తి నాగదుర్గ ఈ గత ఏడాది ఆగస్టు 29న తన సమీప బంధువుల సహకారంతో ఖతార్ బయలుదేరింది.
31న ఖతార్ చేరుకుని అక్కడ ఉన్న ఓ మేడం వద్ద వంటపనికి చేరింది. ఆ యజమానురాలి వద్ద నాలుగు నెలల పాటు సజావుగా గడిచింది. అనంతరం ఆమె కుమార్తె వచ్చి తన పని నచ్చడంతో ఖతార్‌లో ఓ సిటీలో ఉంటున్న తన ఇంటికి తీసుకువెళ్లింది. రెండు నెలలు బాగానే చూసుకున్నారు. అనంతరం తిండి పెట్టకుండా, భర్త ప్రశాంత్, పిల్లలతో, బంధువులతో ఫోన్ మాట్లాడకుండా చిత్రహింసలు పెట్టారు. ఆమె వద్ద ఉన్న ఫోన్‌ను, పాస్‌పోర్టును తీసేకుని హింసించారు. అక్కడ పెట్టే చిత్రహింసలు భరించలేక తన భర్త ప్రశాంత్ వాట్సాప్‌కు వీడియో, వాయిస్ మెసేజ్‌లను పంపించింది.
వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను రిస్క్ చేసి తీసుకుని, మెసేజ్ పెట్టింది. స్థానిక సర్పంచ్ పేరాబత్తుల దొరబాబు, ఉప సర్పంచ్ దిగుమర్తి చిట్టిబాబులకు ఆమె భర్త విషయం తెలియపర్చారు. ఖతార్‌లో ఉన్న ఓ బాబా ద్వారా పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా వారు ఇండియన్ ఎంబాసీని సంప్రదించారు. అక్కడ నుంచి వారు ఇండియాకు పంపారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు విషయాన్ని తెలియపరచి వారి సహకారంతో ఈ నెల 22 అర్ధరాత్రి స్వగ్రామానికి ఆమె చేరుకుంది.
అందరికీ కృతజ్ఞతలు
ఖతార్ వెళ్లి సుమారు 9 నెలలు కావస్తోంది. వెళ్లిన తరువాత ఐదు నెలలు నా బిడ్డలతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే సంతృప్తి కలిగేది. వారి యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే దానిని. అనంతరం ఓ ఇంటిలో కుక్‌గా చేరడంతో ఫోన్, పాస్‌పోర్టు తీసేసుకుని నన్ను చిత్రహింసలు పెట్టారు. ఇండియాకు వెళ్లాలంటే రూ.1.80 లక్షలు కట్టాలని యజమానురాలు బెదిరించేది. అసలు నా బిడ్డలను చూడగలనా, ఎలా ఇంటికి వెళ్లాలో అర్థంకాని పరిస్థితుల్లో కాలం వెళ్లదీశాను. స్వగ్రామం వచ్చేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు.
– నాగదుర్గ