తెలియకుండానే ప్రాణాంతకమయ్యే మెదడు వ్యాధులు.. డాక్టర్ల సూచనలివే!

Vigilance is needed for brain diseases - Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): శరీరంలో అతి ముఖ్యమైనది మెదడు. దాని పనితీరు బాగుంటేనే ఎవరైనా చురుగ్గా పనిచేయగలుగుతారు. ఇటీవలి కాలంలో మెదడుకు సోకుతున్న వ్యాధులు పెరిగాయి. ముఖ్యంగా పలు రకాల ఎన్‌సెఫలైటీస్‌లతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అలా వస్తున్న వారిలో ఆటో ఇమ్యూన్‌ ఎన్‌సెఫలైటీస్, హెర్పిస్‌ ఎన్‌సెఫలైటీస్, జపనీస్‌ ఎన్‌సెఫలైటీస్‌లతో పాటు, రెసిస్టెన్స్‌ ఎపిలెప్సీ, అటాక్సియా వంటి సమస్యలతో వస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు.

వీరిలో ఎక్కువ మంది వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాతే ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి నెలకు 20 నుంచి 30 మంది మెదడు సంబంధిత సమస్యలతో వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ఇటీవల ఈ కేసులు ఎక్కువ వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, సకాలంలో ఆస్పత్రిలో చేరితే ప్రాణాపాయం లేకుండా బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల సోకుతున్న ఎన్‌సెఫలైటీస్‌లు, వాటి లక్షణాలు, చికిత్సలు ఇలా.. 

ఆటోఇమ్యూన్‌ ఎన్‌సెఫలైటీస్‌ 
శరీరంలోని యాంటీబాడీస్‌ ఒక్కోసారి కండరాలతో పాటు మెదడుపై ప్రభావం చూపుతాయి. దీంతో ఫిట్స్‌ రావడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఎక్కువగా వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకిన వారు,  కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్న వారు, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, పలు రకాల కీళ్లవాతం సమస్యలు, ఫ్లూ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి ఈ వ్యాధి రావచ్చు. ఇది సోకిన వారికి మొదటి స్టెరాయిడ్స్, ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఇంజక్షన్స్‌తో పాటు, అవసరమైతే డయాలసిస్‌ చేసి యాంటీబాడీస్‌ను అదుపుచేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.  

హెర్పిస్‌ ఎన్‌సెఫలైటీస్‌ 
ఇది హెర్పిస్‌ వైరస్‌ కారణంగా సోకే తీవ్రమైన మెదడు వాపు జబ్బు. పిల్లలు, పెద్దలు ఎవరికైనా రావచ్చు. తీవ్రమైన జ్వరంతో ప్రారంభమై, ఫిట్స్‌ రావడం, 24 గంటల్లోనే స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీనిని వెంటనే గుర్తిస్తే నయం చేసేందుకు మంచి మందులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకితే  కోలుకోవడానికి వారం నుంచి పదిరోజులు పడుతుంది. తొలిదశలో గుర్తించకపోతే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 

అటాక్సియా 
ఇది సోకిన వారు నడిచేటప్పుడు, నిల్చున్నప్పుడు బ్యాలెన్స్‌ తప్పుతుంటారు. నడవడం కష్టంగా మారుతుంది. పిల్లలు, పెద్దవారిలో ఎవరికైనా రావచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, జన్యు లోపం, క్రోమోజోముల్లో తేడాలతో ఈ వ్యాధి సోకుతుంది. కొందరిలో పుట్టుకతోనే ఈ రకమైన జన్యుపరమైన లోపం ఉంటుంది. దీనిని గుర్తించి చికిత్స పొందితే నయం చేయవచ్చు.  

రెసిస్టెన్స్‌ ఎపిలప్సీ 
సరిగా మందులు వాడని ఫిట్స్‌ రోగులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన వారికి మెదడు మొద్దుబారిపోవడంతో మందులు సరిగా పనిచేయక ఫిట్స్‌ వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. మందులు వేసినప్పటికీ పనిచేయవు. స్పృహ కూడా కోల్పోవచ్చు. ఇలాంటి వారికి ఎక్కువ సమయం పనిచేసే మందులు ఇస్తారు. బ్రెయిన్‌ స్కాన్‌ చేసి, మెదడు ఎంత వరకు డ్యామేజీ అయిందో నిర్ధారిస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా చేస్తారు. అందువలన ఫిట్స్‌ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిది. 

చికిత్సతో నయం చేయొచ్చు 
ఇటీవల ఎన్‌సెఫలైటీస్‌ రోగులు తరచూ వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి ఓపీకి నెలలో 20 మందికి పైగా ఇలాంటి రోగులు వస్తున్నారు. తీవ్రమైన జ్వరంలో ఫిట్స్‌ రావడం, మాట కోల్పోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో వస్తున్నారు. వారు ఏ రకమైన ఎన్‌సెఫలైటీస్‌తో బాధపడుతున్నారో ముందుగా నిర్ధారించి చికిత్స చేస్తున్నాం. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆటో ఇమ్యూన్‌ ప్రాబ్లమ్స్‌కు తొలుత  స్టెరాయిడ్స్‌ ఇచ్చి, తగ్గకుంటే ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఇంజక్షన్స్‌ ఇస్తాం 
–డాక్టర్‌ దారా వెంకటరమణ, న్యూరాలజీ విభాగాధిపతి, విజయవాడ ప్రభుత్వాస్పత్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top