అక్రమ లే అవుట్‌లపై విజిలెన్స్‌

Vigilance on illegal lay outs in Andhra Pradesh - Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో అనుమతిలేని లే అవుట్‌లపై కొరడా

విజిలెన్స్‌ బృందాలు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం

గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో అనుమతుల్లేకుండా వెలుస్తున్న లే అవుట్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డివిజన్, జిల్లా స్థాయిలో విజిలెన్స్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేసింది. కొన్నేళ్లుగా నగరాలు, పట్టణాలకు చుట్టుపక్కల గ్రామ పంచాయతీల పరిధిలోను, మండల కేంద్రాలు, హైవేల పక్కన గ్రామాల్లోను కొందరు వ్యాపారులు అక్రమ లే అవుట్‌లు వేశారు. వీటివల్ల ఆయా పంచాయతీలు ఆదాయాన్ని కోల్పోతుండడంతో పాటు ఈ అక్రమ లే అవుట్‌లలో ఇంటి స్థలం కొన్నవారు తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అనుమతుల్లేని లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలిచ్చేందుకు నిరాకరిస్తుండడంతో చాలామంది మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నట్టు ప్రభుత్వానికి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు కూడా అందాయి.

ఈ నేపథ్యంలో పంచాయతీల్లో అక్రమ లే అవుట్‌లకు అడ్డుకట్ట వేసేందుకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతుల్లేని లే అవుట్‌లు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోను లే అవుట్‌లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనుమతితో అనధికారిక లే అవుట్ల క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో చాలాచోట్ల పంచాయతీలు.. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిలో ఉన్నాయని, లే అవుట్‌లకు అనుమతుల సందర్భంగా వస్తున్న ఫీజులో సగం పంచాయతీలకు రావాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు మునిసిపాలిటీ అధికారులతో మాట్లాడి రావాల్సిన డెవలప్‌మెంట్‌ ఫీజులను పంచాయతీరాజ్‌శాఖ వసూలు చేయాలని సూచించారు. అక్రమ లే అవుట్‌ల నియంత్రణకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో ప్రత్యేకంగా విజిలెన్స్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఈవోపీఆర్‌డీతో సహా ముగ్గురితో, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈవో, డీపీవో, జిల్లా టౌన్‌ప్లానింగ్‌ అధికారితో కూడిన విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.

2015 నాటికే 6,098 అక్రమ లే అవుట్లు..
2015 నాటికే గ్రామీణ ప్రాంతాల్లో 6,098 అక్రమ లే అవుట్‌లు ఉన్నట్టు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. తర్వాత కొత్తగా వెలిసిన వాటితో కలిపి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయన్నది విజిలెన్స్‌ బృందాలు గుర్తిస్తాయని చెప్పారు. ఈ అక్రమ లే అవుట్‌ల క్రమబద్ధీకరణ ద్వారానే గ్రామ పంచాయతీలకు రూ.వందల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ పాల్గొన్నారు.  

విజిలెన్స్‌ బృందాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే లే అవుట్‌లపై విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ జిల్లా అధికారులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు. డివిజన్, జిల్లా స్థాయి బృందాలు ఇప్పటికే ఉన్న అక్రమ లే అవుట్‌లపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇకమీదట పంచాయతీల్లో అక్రమ లే అవుట్‌లు ఏర్పాటు కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ లే అవుట్‌లు గుర్తించినచోట ఆ విషయాన్ని స్థానిక ప్రజలందరికీ తెలిసేలా గ్రామంలో దండోరా వేయించాలని సూచించారు. ప్రతినెలా విజిలెన్స్‌ బృందాలు సమావేశం కావాలని నిర్దేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top