‘స్వచ్ఛ’ సేవకు యూజర్‌ చార్జీ 

User Charges Garbage Swachh Bharat Mission - Sakshi

కేంద్రం ఆదేశాలు జారీ

ఐదు నెలల్లో ఏపీలో రూ.15.81 కోట్లు వసూలు 

సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్న చెత్తను సేకరించి, ప్రాసెస్‌ చేసే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూజర్‌ చార్జీలు చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలను నూరు శాతం అందించిన స్థానిక పట్టణ సంస్థల్లో చార్జీల వసూళ్లు మొదలయ్యాయి. గత ఐదు నెలలుగా 17 యూఎల్‌బీల్లో ఫీజు వసూలు చేస్తుండగా.. ఇప్పటి దాకా ఆయా ప్రాంతాల్లో 26.89 శాతం వసూలైంది. రాష్ట్రంలోని 123 స్థానిక పట్టణ సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటింటి చెత్త సేకరణకు చెత్త డబ్బాలు అందజేయడంతో పాటు.. ఆ చెత్తను ప్రాసెస్‌ యూనిట్లకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సైతం అందించనున్నారు. మొదటి విడతగా 42 యూఎల్‌బీలను ఎంపిక చేసి వాహనాల అందజేత ప్రారంభించగా, 17 యూఎల్‌బీలకు నూరు శాతం వాహనాల ను అందించగా, మరో 15 యూఎల్‌బీలకు యాభై శాతం వాహనాలను సరఫరా చేసి సేవలు ప్రారంభించారు.  

డిమాండ్‌లో 26.89 శాతం వసూలు
రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిధులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలను పాటిం చాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అందులో భాగంగా ఇంటింటి చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని, ఆ నిధులను వాహనాలు, చెత్త ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వహణకు వినియోగించాలని షరతు విధించింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా 2014–2019 సంవత్సరాలకు గాను మొదటి విడతలో కేంద్రం వాటాగా రూ.567 కోట్లు అందించింది. అయితే, ఇంటింటి చెత్త సేకరణలో 75 శాతం యూజర్‌ చార్జీలు వసూలు చేస్తేనే రెండో విడత స్వచ్ఛ భారత్‌ నిధులు ఇస్తామని చెబుతోంది. అయితే, 17 స్థానిక పట్టణ సంస్థల నుంచి రూ.58.81 కోట్ల డిమాండ్‌ ఉండగా.. నవంబర్‌ నుంచి మార్చి వరకు రూ.15.81 కోట్లు వసూలయింది. అంటే మొత్తం డిమాండ్‌లో 26.89 శాతం మాత్రమే వసూలైంది.  ప్రస్తుతం యూజర్‌ చార్జీల వసూళ్లలో గుడివాడ మున్సిపాలిటీ 60.42 శాతంతో ముందుండగా, అమలాపురం మున్సిపాలిటీ 60.31 శాతంతో రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత కాకినాడ (54.59 శాతం), తాడేపల్లిగూడెం (50.13 శాతం), పార్వతీపురం (50.06 శాతం) మున్సిపాలిటీలు ఉన్నాయి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top